తెలంగాణ కొత్త స‌చివాల‌యానికి లైన్ క్లియ‌ర్‌!

Tuesday, June 11th, 2019, 02:45:19 PM IST

తెలంగాణ ప్ర‌భుత్వం కొత్త స‌చివాల‌యానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. తెలంగాణకు సంబంధించిన భ‌వ‌నాల‌ని ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ అప్ప‌గించ‌డానికి ఇటీవ‌లే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. దీంతో తెలంగాణ స‌చివాల‌య నిర్మాణానికి క‌ద‌లిక మొద‌లైంది. తెలంగాణ‌లో ఏపీకి కేటాయించిన హెచ్‌, కె, జె, ఎల్ భ‌వ‌నాల‌ని తెలంగాణ‌కు అప్ప‌గించ‌డానికి ఏపీ ఐఏఎస్ అధికారి ప్రేమ్ చంద్రారెడ్డి సోమ‌వారం తెలంగాణ అధికారుల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. భ‌వ‌నాల అప్ప‌గింత‌పై చ‌ర్చించారు.

ఈ నాలుగు బ్లాకుల్లోని మెటీరియ‌ల్ అంతా ఏపీకి త‌ర‌లించినా ఆ భ‌వ‌నాల్ని తెలంగాణ ప్ర‌భుత్వానికి అప్ప‌గించ‌లేదు. ఈ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయ‌డం కోసం సోమ‌వారం ఇరు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు చెందిన అధికారులు స‌మావేశ‌మై ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు. త్వ‌ర‌లోనే ఈ బ్లాకుల్ని తెలంగాణ‌కు అప్ప‌గిస్తామ‌ని వెల్ల‌డించ‌డంతో తెలంగాణ స‌చివాయ నిర్మాణానికి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు కేసీఆర్‌. ఇప్పుడున్న స‌చివాల‌యం వాస్తుకు లేక‌పోవ‌డంతో అక్క‌డికి కేసీఆర్ వెల్ల‌డం లేదు. ప్ర‌గ‌తి భ‌వన్ నుంచే పాల‌న కొన‌సాగిస్తున్నారు. అన్నీ స‌వ్యంగా పూర్త‌యితే ఈ నెల 27వ తేదీ లోపు నూత‌న స‌చివాల‌యానికి భూమి పూజ జ‌ర‌పాల‌ని ఇప్ప‌టికే ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలుస్తొంది. తెలంగాణ స‌చివాల‌యం కోసం బైస‌న్ పోలో గ్రౌండ్‌ని తెలంగాణ ప్ర‌భుత్వం కోరిన విష‌యం తెలిసిందే.