తెలంగాణ పోలీసులు గొప్పవారు – ప్రశంసించిన ప్రయాణికుడు

Saturday, December 14th, 2019, 12:05:31 PM IST

ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర పోలీసులపై అందరు కూడా ఒకరకమైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. తాజాగా ఒక ప్రయాణికుడు తెలంగాణ పోలీసులు గొప్పవారని వాఖ్యానించారు. కాగా సౌదీ అరేబియా నుండి తన స్వస్థలానికి వస్తున్నటువంటి ఆరిఫ్ అనే వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాడు. అయితే తన స్వస్థలమైన విజయవాడకు వెళ్లేందుకు అతడు క్యాబ్ బుక్ చేసుకున్నాడు. అయితే తన అవసరాల నిమిత్తం ఎల్బీనగర్ లోని రెయిన్బో హాస్పిటల్ వద్ద దిగి, అటువైపు తిరగగానే, క్యాబ్ డ్రైవర్ తన సామాన్లతో సహా పరారయ్యాడు. కాగా ఈ ఘటన నుండి తేరుకున్న ఆరిఫ్, తక్షణమే 100 కి డయల్ చేసి, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కాగా రాచకొండ పోలీసులు క్షణాల్లో ఆరిఫ్ ఉన్న స్థలానికి వచ్చి జరిగిందంతా తెలుసుకున్నారు. అయితే వెంటనే పోలీసులు తమ దగ్గర ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, సంబంధిత యాప్‌ తో సదరు క్యాబ్ కి సంబంధించి సీసీ ఫుటేజ్ చెక్ చేసి, ఆ కారు ని ట్రాక్ చేశారు. కాగా చివరికి ఆ డ్రైవర్ ని గుర్తించి, తక్షణమే తమ దగ్గరికి రావాల్సిందిగా హెచ్చరికలు చేశారు. కాగా ఆ కారు వచ్చాక తన లగేజ్ ని తనకు అప్పగించి పోలీసులు అక్కడినుండి వెళ్లిపోయారు. అయితే తన సమస్యను దగ్గరుండి పరిష్కరించినందుకు రాచకొండ పోలీసులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పుకుంటూ, తెలంగాణ పోలీసులు గొప్పవారు అని ప్రశంసించారు.