ఆర్టీసీ సమ్మెకు కార్మికులు పుల్‌స్టాఫ్.. పోరాడి ఓడినట్టేనా..!

Wednesday, November 20th, 2019, 06:34:40 PM IST

తెలంగాణలో గత 48 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు ఎట్టకేలకు పుల్‌స్టాఫ్ పడింది. హైకోర్ట్ తీర్పును గౌరవిస్తూ సమ్మెను విరమిస్తున్నామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. అయితే అక్టోబర్ 5న తమ న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చుకోవడానికి, ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్నారని, ఆర్టీసీ ఆస్తులను కొట్టేసే ప్లాన్‌లో ప్రభుత్వం ఉందని ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ సమ్మెకు శంఖారావం పూరించారు.

అయితే కార్మికులు తమ డిమాండ్ల కోసం ఆత్మహత్యలకు పాల్పడినా, నిరసనలు చేపట్టినా ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు. అంతేకాదు ఆర్టీసీ కార్మికులకు డెడ్‌లైన్ విధించి విధులలోకి రాకపోతే ఇక తిరిగి ఉద్యోగంలోకి తీసుకోమని చెప్పినా కార్మికులు వెనకడుగు వేయలేదు. అయితే గత మూడు నెలలుగా వేతనాలు లేక, వేరే పనులు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతూ న్యాయంగా కోర్ట్‌లో పోరాడుతున్న కార్మికులకు హైకోర్టులో నిరాశ ఎదురయ్యింది. ఆర్టీసీ వ్యవహారాన్ని హైకోర్ట్ లేబర్ కోర్టుకు అప్పచెప్పి చేతులెత్తేసింది. అయితే సమ్మెపై జేఏసీ నాయకులు, కార్మికులు చర్చలు జరిపాక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అనేది మాత్రం ఇంకా తెలియడం లేదు. అసలు కార్మికులను తిరిగి ఉద్యోగాలలో చేర్చుకుంటుందా లేదా, చేర్చుకుంటే ఏదైనా షరతులతో కూడిన ఒప్పందం కుదుర్చుకుంటుందా అనే రకరకాల సందేహాలు తలెత్తుతున్నాయి. ఏదేమైనా 26 డిమాండ్ల కోసం, దాదాపు 48 రోజులు కార్మికులు పోరాడి ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చుకోకుండా ఓడారనే చెప్పాలి.