ద‌స‌రాకి తెలంగాణ రాష్ట్ర సినీ పుర‌స్కారాలు, టైటిల్ నాట్ ఫైన‌ల్‌!!

Wednesday, February 8th, 2017, 11:37:48 PM IST


ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక రాష్ట్ర ప్ర‌భుత్వ అవార్డులైన `నంది` అవార్డుల్ని ఎలా ఇవ్వాలి? అన్న ప్ర‌శ్న మొద‌లైంది. నంది అవార్డులు ఏపీలో ఇవ్వాల‌ని ప్ర‌తిపాదించారు కాబ‌ట్టి తెలంగాణ ప్ర‌భుత్వం ఇచ్చే అవార్డుల‌కు ఏ పేరు పెట్టాలి? అన్న కొత్త ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అధికారిక సినీఅవార్డుల‌కు ఓ పేరును ప‌రిశీలిస్తున్నారు. ఈ విష‌యంపై సినిమా జ‌ర్న‌లిస్టులు అడిగిన ప్ర‌శ్న‌కు రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస‌యాద‌వ్ ఫిలించాంబ‌ర్‌లో జ‌రిగిన ఓ స‌మావేశంలో స్పందించారు.

“గ‌తంలో ఉగాదికి నంది అవార్డులు ఇచ్చేవారు. అదే త‌ర‌హాలో ఇప్పుడు తెలంగాణ ప్ర‌భుత్వం కూడా ద‌స‌రాకి ఈ త‌ర‌హా అవార్డులు ఇవ్వాల‌న్న ప్ర‌తిపాద‌న ఉంది. అలాగే అవార్డుల‌కు ఏ పేరు పెట్టాలి? అని ఆలోచిస్తున్నాం. ఇప్ప‌టికే నాలుగు పేర్లు అనుకున్నాం. అందులోంచి ఒక‌టి ఫైన‌ల్ చేసి పేరు పెట్టాల్సి ఉందింకా“ అంటూ క్లారిటీనిచ్చారు. అయితే తెలంగాణ రాష్ట్ర అధికారిక అవార్డుల‌కు `సింహా` అవార్డులు అనే పేరు ఇదివ‌ర‌కు వినిపించింది. మ‌రి అదే పేరు ఖాయం చేస్తారా? లేక ఆ స్థానంలో ఇంకేదైనా కొత్త టైటిల్ వినిపిస్తుందా వేచి చూడాల్సిందే.