రాష్ట్ర అవతరణ వేడుకలలో రైతులకు తీపి కబురు అందించిన సీఎం కేసీఆర్..!

Sunday, June 2nd, 2019, 11:08:02 AM IST

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అవతరణ వేడుకలను జెండా ఎగరవేసి ప్రారంభించారు. ముందుగా గన్‌పార్క్‌ దగ్గర అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్‌ నివాళులు అర్పించిన అనంతరం పబ్లిక్‌ గార్డెన్స్‌లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో సీఎం పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అయితే ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన ఈ ఐదేళ్ళలో ఎన్నో అవరోధాలు అధిగమించి రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని ఆయన అన్నారు.

అంతేకాదు రాష్ట్రంలో ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా ఒకరికొకరు సంతోషంగా జీవనం కొనసాగిస్తున్నారని సీఎం కేసీఅర్ అన్నారు. అయితే ఈ సభలో ప్రభుత్వం తరుపున రైతులకు మరో వరాన్ని కూడా ప్రకటించారు కేసీఆర్. రాష్ట్రంలో రైతులకు మరో రూ.లక్ష రుణమాఫీ చేయబోతున్నామని ప్రకటించారు. అయితే ఇప్పటికే రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేశామని ఇప్పుడు మళ్ళీ లక్ష చేయబోతున్నమని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు రైతులకు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకం తీసుకొచ్చామని ఇప్పటి వరకు ఎకరానికి 4 వేలు ఇచ్చిన ప్రభుత్వం ఈ ఏడాది ఖరీఫ్ నుంచి దానిని 5 వేల్కు పెంచి నేరుగా రైతుల ఖాతాలలో జమ చేస్తామని చెప్పారు. తెలంగాణలో ఇకపై కరువు అనేది కన్పించదని, రాష్ట్రంలోని అన్ని చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతాయని అన్నారు. అంతేకాదు ఏ వ్యవస్థలోనైనా అవినీతికి పాలపడినట్లయితే వారికి కఠిన శిక్షలు తప్పవని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.