టీఆర్ఎస్‌లోకి టీటీడీపీ బాస్.. ఈటల ప్లేస్ భర్తీ చేసేందుకేనా?

Tuesday, June 8th, 2021, 02:15:55 AM IST

తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి ఈటల బీజేపీలోకి చేరుతున్న నేపధ్యంలో ఆయనకు చెక్ పెట్టేందేకు అధికార టీఆర్ఎస్ వేగంగా పావులు కదుపుతుంది. ఈ క్రమంలోనే భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీమంత్రి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణను పార్టీలోకి చేర్చుకునేందుకు సిద్దమైనట్టు తెలుస్తుంది. ఈ మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆయనతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తుంది.

అయితే పద్మశాలి సామాజికవర్గానికి చెందిన ఎల్‌.రమణకు బీసీ వర్గాల్లో మంచి గుర్తింపు ఉంది. ఈటల వంటి బీసీ ముఖ్యనేత స్థానాన్ని మరో బీసీ నేతతోనే భర్తీ చేయాలని అది కూడా ఈటల జిల్లా అయిన కరీంనగర్ జిల్లాకు చెందిన నేత అయితేనే బాగుంటుందని భావించిన టీఆర్ఎస్ పార్టీ ఆయనకు ఎమ్మెల్సీ ఆఫర్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఎల్.రమణ రాష్ట్ర విభజన తర్వాత నుంచి టీటీడీపీ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. అయితే ఇటీవల టీటీడీపీ తరపున ఫట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పటికీ రమణ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. అయినప్పటికీ ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు టీఆర్ఎస్ ఆసక్తిని కనబరుస్తుంది.

అయితే పార్టీ మారుతున్నారన్న వార్తలపై స్పందించిన ఎల్. రమణ పార్టీ మార్పుపై ఇంకా ఎలాంటి ఆలోచన చేయలేదని, సన్నిహితులతో మాట్లాడిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అయితే తనకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫోన్ చేసిన మాట వాస్తవమేనని, తనను కేసీఆర్ గుర్తు చేశారని చెప్పినట్టు చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికే టీఆర్ఎస్‌లో చేరిపోగా ఇప్పుడు ఎల్.రమణ కూడా పార్టీని వీడితే తెలంగాణలో టీడీపీ దాదాపుగా కనుమరుగైనట్టే అన్న టాక్ వినిపిస్తుంది.