విశ్లేషణ: తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై తెలుగుఇన్ స్పెషల్ ఫోకస్..!

Thursday, October 17th, 2019, 02:40:02 AM IST

ఆర్టీసీ ప్రస్తుతం ఈ పేరు తెలంగాణలో పెద్ద హాట్ టాఫిక్‌గా మారిపోయింది. గత కొద్ది రోజులుగా ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను నెరవేర్చాలని, లేదంటే సమ్మె తప్పదని ప్రభుత్వానికి ముందుగానే ఆర్టీసీ జేఏసీ నోటీసులు అందించింది. అయితే ప్రభుత్వం కార్మికుల డిమాండ్లను పక్కన పెట్టడంతో సమ్మెకు శంఖారావం మోగించి, విధులను బహిష్కరించి కార్మికులు తమ నిరసనను తెలుపుతున్నారు. అయితే కార్మికులు చేపట్టిన సమ్మె పండుగ సీజన్ కావడంతో రవాణా లేక ప్రజలు ఇబ్బందులు పడతారని సమ్మెని విరమించుకోవాలని ప్రభుత్వం కార్మికులను కోరింది. అయితే కార్మికులు వెనక్కి తగ్గకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. తాత్కాళికంగా డ్రైవర్లను, కండక్టర్‌లను నియమించి కొన్ని బసులను నడుపుతూ వచ్చింది.

అయితే కార్మికుల సమ్మెను సీరియస్‌గా తీసుకున్న సీఎం కేసీఆర్ ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని, ఇక మీదట ఆర్టీసీ కార్మికులతో ఎలాంటి చర్చలు జరిపేది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం విధించిన గడువులోగా విధులకు హాజరుకానీ సిబ్బందిని ఇక తిరిగి విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని, ఇక ఆర్టీసీలో మిగిలింది కేవలం 1200 మంది ఉద్యోగులు మాత్రమే అని తేల్చి చెప్పారు. అంతేకాదు ఆర్టీసీలో కొన్ని కీలక మార్పులు తెచ్చే విధంగా ఆర్టీసీనీ మొత్తం మూడు రకాలుగా విభజిస్తూ 50% బస్సులు ఆర్టీసీ నడుపుతుందని, 30% బస్సులు అద్దెవి నడుపుతామని, మరో 20% బస్సులు పూర్తిగా ప్రైవేట్ బస్సులు నడిపేలా ప్రణాళికలు రూపొందించారు. అయితే ఆర్టీసీ కార్మికులు మాత్రం తాము ప్రభుత్వ బెదిరింపులకు భయపడబోమని తమ న్యాయపరమైన డిమాండ్ల కోసం సమ్మెను మరింత ఉదృత్తం చేస్తామని చెప్పడంతో ఈ సమస్య మరింత తీవ్రతరంగా మారిపోయింది.

అయితే అసలు ఆర్టీసీ కార్మికులు కోరుతున్న డిమాండ్లు ఏమిటీ, ఆర్టీసీ నిజంగా నష్టాలలో ఉందా, ప్రభుత్వం ఆర్టీసీనీ ఎందుకు విలీనం చేయలేకపోతుంది, ఆర్టీసీనీ ఎందుకు ప్రభుత్వంలో విలీనం చేయాలి అనే దానిపై తెలుగుఇన్ స్పెషల్ ఫోకస్ మీ కోసం.

ఆర్టీసీ కోరుతున్న ప్రధాన డిమాండ్లు

1) ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేయాలి.
2) ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి.
3) ఆర్టీసీ ఆస్తులను సంరక్షించాలి.
4) 1-04-2017 వేతన సవరణను వెంటనే అమలు చేయాలి.
5) ఎంప్లాయిస్ యూనియన్ చేసిన అగ్రిమెంట్ ప్రకారం ప్రతి నెల 1వ తారీఖున జీతాలు చెల్లించాలి.
6) అర్హులైన వారందరికి ప్రమోషన్లు ఇవ్వాలి. ప్రమోషన్ పోస్ట్‌లలో ఔట్‌సోర్సింగ్ తీసుకోరాదు.
7) అన్ని క్యాటగిరీలలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి.
8) డ్యూటీకి రిపోర్ట్ చేసిన వారికి హాజర్ ఇవ్వాలి.
9) డబుల్ డ్యూటీకి డబుల్ వేజెస్ ఇవ్వాలి.
10) 5 సంవత్సరాలు సర్వీస్ పూర్తి అయిన సిబ్బందికి కన్‌ఫర్మేషన్ లెటర్స్ ఇవ్వాలి.
11) వెహికల్ కండీషన్ మెరుగుపరచాలి.
12) రీజియన్‌లోని అన్ని డిపోలలో త్రాగునీటి వసతి మరియు సానిటేషన్ మెరుగుపరచాలి.
13) ఆర్.ఎం దగ్గర ఉన్న ట్రాన్స్‌ఫర్ అప్లికేషన్స్‌ని వెంటనే పరిష్కరించాలి.
14) నైట్ అవుట్ సర్వీసులను అన్ని వసతులతో కూడిన రెస్ట్ రూం ఉన్న దగ్గరనే పెట్టాలి.
15) గ్యారేజీ కార్మికులకు నూతన టెక్నాలజీకి అనుగుణంగా శిక్షణ ఇవ్వాలి.
16) మహిళా కండక్టర్లకు రాత్రి 9 గంటలలోపు ముగించే డ్యూటీలు ఇవ్వాలి.
17) రూట్‌కి సరిపోయే రన్నింగ్ టైం ఇవ్వాలి.

ఆర్టీసీ నిజంగా నష్టాలలో ఉందా?

ఆర్టీసీ ఆస్తులు దాదాపు మొత్తం 80 వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. అయితే ఆర్టీసీకి ఉన్న నష్టాలు ఏడాదికి 720 కోట్ల నష్టం, మొత్తం మీద ఇప్పటిదాకా 2 వేలకు కోట్లకు పైగా నష్టాలు ఉన్నాయి. అయితే ఆర్టీసీకి నష్టం ఎందుకు వస్తుందనే దానిపై పరిశీలిస్తే దానికి ఏకైక కారణం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వేస్తున్న పన్నులే కారణం. ఆర్టీసీ ప్రతి ఏటా డీజీల్‌పైన 1300 కోట్లు ఖర్చు పెడుతుంటే, సుమారుగా 600 నుంచి 650 కోట్లు పన్నుల రూపంలో చెల్లిస్తుంది ఇందులో దాదాపు రాష్ట్ర ప్రభుత్వానికే 320 కోట్లు పన్నుల రూపంలో చెలిస్తుంది. ఇక మోటర్ వెహికల్ ట్యాక్స్ పైన ఏడాదికి 290 కోట్లు, స్పేర్ పార్ట్స్‌పైన ఏడాదికి 150 కోట్లు ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తుంది. దీనిని బట్టి చూస్తే ఆర్టీసీపై ఏడాదికి ప్రభుత్వం చెబుతున్న నష్టాలు 720 కోట్లు ఉంటే, ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ కట్టే పన్ను దాదాపు 740 కోట్లు. అయితే ప్రజాపయోగ రవాణా కోసం నడుస్తున్న ఆర్టీసీపై ప్రభుత్వం ఈ పన్నులను తొలగిస్తే అసలు ఆర్టీసీకి నష్టం అనేది దాదాపుగా ఉండకపోవచ్చు. అయితే ఆర్టీసీ మొత్తం వ్యయంలో 2015లో డీజిల్‌ఫై పెడుతున్న ఖర్చు 20% గా ఉంటే, 2018-19లో ఆర్టీసీ డీజిల్‌పై పెడుతున్న ఖర్చు 32%కి పెరిగింది. అయితే ఈ పెరుగుదలకు డీజిల్ పెరుగుదలనే ముఖ్య కారణం. అయితే ఆర్టీసీ మొత్తం వ్యయంలో ఉద్యోగుల జీతభత్యాలపై 2015లో 54.85% ఖర్చు పెడితే, 2018-2019లో ఉద్యోగుల జీతభత్యాలపై 56% మాత్రమే పెరిగింది. అంటే ఈ ఐదేళ్ళలో డీజీల్‌పై 12% ఖర్చు పెరిగితే, ఉద్యోగుల జీతభత్యాలపై మాత్రం కేవలం 1% మాత్రమే పెరిగింది. అయితే ఆర్టీసీ నష్టాలలోకి రావడానికి కారణం ఉద్యోగుల జీతభత్యాలు కాదు కేవలం పెరుగుతున్న డీజీల్, పన్నుల భారం కారణంగానే ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయి.

అయితే ప్రజా రవాణా వ్యవస్థగా ఉన్న కారణంగా ప్రభుత్వం పెరుగుతున్న డీజీల్ ధరలకు అనుగుణంగా టికెట్ ఛార్జీలు పెంచకపోవడం, అర్బన్ ప్రాంతాలలో, ట్రాఫిక్‌లో కూడా ఖచ్చితంగా బస్సులు నడిపించడం వంటివి చేస్తుంటే ఖచ్చితంగా ఆర్టీసీకి నష్టాలే వస్తాయి. అయితే ఆర్టీసీ ప్రజా సంక్షేమం కోసం నడుస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం డీజీల్‌పై వసూల్ చేస్తున్న పన్నును మినహాయిస్తే అసలు నష్టాలే ఉండవు. ఒకవేళ అది జరగకపోతే నష్టం వచ్చే ప్రాంతాలలోనైనా ఆర్టీసీకి వయాబులిటీ గ్యాప్ ఫండింగ్, పార్శిల్ సర్వీస్, ప్రైవేట్ బస్సుల దోపిడీని అరికట్టడం, డీజీల్‌పై ఒక ఖచ్చితమైన రేట్‌ను ఫిక్స్ చేయడం, బడ్జెట్‌లో ఆర్టీసీకి కొంత మొత్తాన్ని కేటాయించడం, కొత్త బస్సులను కొనడం వంటి కొన్ని విధానాలను ప్రభుత్వం అమలు చేస్తే ఆర్టీసీకి నష్టాలే ఉండవు. ఇదంతా వదిలేసి ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయన్న నెపంతో ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆర్టీసీనీ, ఆర్టీసీ ఆస్తులను సంరక్షించుకునేందుకూ తాము సమ్మె చేపట్టామని కార్మికులు చెప్పుకొస్తున్నారు.

ప్రభుత్వం ఆర్టీసీనీ ఎందుకు విలీనం చేయలేకపోతుంది?

ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేస్తే సామాన్య ప్రజలకు పెద్దగా ఉపయోగం లేకపోయినా ఆర్టీసీలో పనిచేసే కార్మికులకు మాత్రం ఉద్యోగ భద్రత ఉంటుంది. కార్మికులకు సకాలంలో జీతాలు అందడం, ప్రభుత్వం అందించే ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కార్మికులకు వర్తించడం జరుగుతాయి. అయితే ప్రభుత్వం వారికి ఇవన్ని కల్పించే ఉద్దేశ్యం కనబరచకుండా, ఎన్నో ఏళ్ళుగా సంస్థలో కష్టపడి పనిచేస్తున్న కార్మికులను పక్కన పెట్టి, ఆర్టీసీనీ ప్రైవేట్ చేతుల్లో పెట్టి ప్రభుత్వం సొమ్ము చేసుకోవాలని చూస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఆర్టీసీనీ ఎందుకు ప్రభుత్వంలో విలీనం చేయాలి?

మనకు స్వాతంత్రం రాకముందు తెలంగాణను పాలించిన అప్పటి 6వ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్‌కు కోడలు జోహ్రా బేగం పేద ప్రజలకు గుర్తుండిపోయేలా ఏదో ఒక మంచి పని చేయాలని అనుకుంది. అయితే ఒకరోజు జోహ్ర బేగం నాంపల్లి రైల్వే స్టేషన్ ముందు వెళ్తుండగా చాలా మంది మూటలు మోసుకుని నడుచుకుంటూ వెళుతున్నారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్న జోహ్రా బేగం తన మామ గారైన మీర్ మహబూబ్ అలీఖాన్‌తో మాట్లాడి 9 బస్సు డీపోలు ఏర్పాటు చేయించి, 50 బస్సులు కొని నాందేడ్, వరంగల్, గుల్బర్గా, రాయచూర్, వనపర్తి బస్సు డిపోల నుండి రైలు స్టేషన్‌కు ప్రయాణికులను తీసుకెళ్లేలా ఏర్పాటు చేశారు. అయితే దానికి NSRRTD (Nizam State Road and Rail Transport Department) అని పేరు పెట్టారు. అయితే ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేసిన జోహ్రా బేగం పేరు మొదటి అక్షరం Z ఇప్పటికి బస్సుల నంబర్‌పై ఉంటుంది. అయితే అప్పట్లో బ్రిటీష్ ఇండియాలో ఎక్కడా కూడా ప్రజా రవాణా లేదు కేవలం నిజాం రాష్ట్రంలో మాత్రమే ఉంది. అయితే ఆ తరువాత NSRRTD ని NSRTDగా మార్చి రైల్వే నుంచి వేరు చేసి ప్రభుత్వంలో విలీనం చేసింది నిజాం సర్కార్. అయితే 1956 ఆంధ్ర రాష్ట్రం తెలంగాణతో కలిసినప్పుడు అప్పుడు ఆంధ్రలో ఆర్టీసీ లేదు, ప్రభుత్వ రంగం లేదు. అయితే కేవలం ప్రైవేట్ బస్సులు మాత్రమే ఉన్న కారణంగా అప్పటి నుంచి ఇక్కడి ఆర్టీసీ కూడా ఒక కార్పోరేషన్‌గా మారిపోయింది. అయితే ఆర్టీసీనీ నిజాం సర్కార్ ప్రభుత్వంలో చేర్చితే, ఆంధ్ర సర్కార్ కార్పోరేషన్‌గా మార్చింది. అంతేకాదు అప్పట్లో నిజాం చేసిన NIMS, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఉస్మానియా ఆసుపత్రి, నీలోఫర్, అసెంబ్లీ ఇలా అన్ని ఇప్పటికి ప్రభుత్వంలో కొనసాగుతుంటే కేవలం ఆర్టీసీ మాత్రం ఒక కార్పోరేషన్‌గా మిగిలిపోయింది.

అయితే ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం నెరవేరుస్తుందా లేదా అనేది పక్కన పెడితే ఒకే సారి 48 వేల్ మంది కార్మికుల ఉద్యోగాలు తొలగిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడడం ఖాయం. కాబట్టి ప్రభుత్వం ఈ విధమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని కార్మికులతో చర్చలు జరిపి తదుపరి నిర్ణయాలు తీసుకుని సమస్యను పరిష్కరించుకోవలసిందిగా పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.