త్వరలో రాజకీయాల్లోకి ఆ సీనియర్ నటుడు?

Monday, March 5th, 2018, 03:08:24 PM IST

ప్రముఖ సీనియర్ నటులు సుమన్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. రాజకీయాలంటే తనకు ఇష్టమని, మంచి చేసే రాజకీయనాయకులని చూస్తే తనకు కూడా తనవంతు ఏదైనా ప్రజలకు చేయాలని ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఏపీలోని చంద్రబాబు సర్కారు, తెలంగాణలోని కేసీఆర్ సర్కారు తాను కోరుకున్న విధంగా పాలన సాగిస్తే, వారికి మద్దతు పలుకుతానని, అవసరమైతే రానున్న ఎన్నికల్లో వారికి అనుకూలంగా ప్రచారం చేయడంతో పాటు ఆ దేవుడు అవకాశమిస్తే ప్రత్యక్షంగా బరిలోకి దిగేందుకూ సిద్ధమని నటుడు సుమన్ వ్యాఖ్యానించారు.

ఒక కార్యక్రమం నిమిత్తం నేడు హుజూర్ నగర్ విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. వైద్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో మరింత అభివృద్ధి దిశగా పాలకులు కృషి సాగించాలని ఆయన కోరారు. దేశంలో మరెక్కడా లేని విధంగా వ్యవసాయానికి నిరంతర విద్యుత్ ను అందిస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క కేసీఆర్ కు మాత్రమే దక్కిందని ఆయనపై పొగడ్తలు కురిపించారు. రైతులకు బీమా సౌకర్యాన్ని కల్పించడం అభినందనీయమని, గ్రామాల అభివృద్ధికి బాటలు వేయాల్సిన అవసరం ఉందని, పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని చెప్పారు. దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పేదల్లో భరోసా నింపిందని, పేదల పెన్నిధిగా అయన అందించిన పాలన వల్లనే ప్రజలు ఆయన్ని ఎప్పటికి గుర్తుపెట్టుకుంటారని ఆయన అన్నారు…