రాహుల్ రాకపోతే తాత్కాలిక అధ్యక్షుడి నియామకం – కాంగ్రెస్ అధిష్టానం

Wednesday, June 12th, 2019, 03:01:21 AM IST

ఇటీవల దేశవ్యాప్తంగా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో దారుణమైన తమిని నమోదు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ కి ఇన్నిరోజులు అధ్యక్షుడుగా ఉంటున్నటువంటి రాహుల్ గాంధీ, తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసి దాదాపు రెండు వారాలు గడిచినప్పటికీ కూడా కొత్త అధ్యక్షుడి నియామకం ఇంకా జరగలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి బాధ్యతలు తిరిగి చేపట్టామని ఎంతమంది చెప్పినప్పటికీ కూడా రాహుల్ గాంధీ మాత్రం ససేమిరా అంటున్నారు. అయితే రాహుల్ గాంధీని ఎలాగైనా ఒప్పించి తిరిగి తన అధ్యక్ష పదవికి తిరిగి తీసుకొచ్చేంతవరకు కూడా తాత్కాలిక అధ్యక్షుడిని నియమించాలని పార్టీ ఆలోచిస్తుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత ఏకే ఆంటోనీ ఈ వారంలోనే రాహుల్‌ను కలిసి నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరే అవకాశం ఉంది.

కాగా రాహుల్ తీసుకున్న నిర్ణయాల వలన రాష్ట్రాల్లో పరిస్థితులన్నీ కూడా తారుమారయ్యాయి… కాగా తన నిర్ణయాన్ని మార్చుకోవాలని ఎంత మంది చెప్పినప్పటికీ కూడా రాహుల్ గాంధీ అసలే వినడం లేదు. కాగా రాహుల్ నిర్ణయంతో విసిగిపోయిన సోనియా గాంధీ ఒక నిర్ణయానికి వచ్చారు. నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులే అధ్యక్ష స్థానంలో ఉండాలనే నియమం లేదని, ఎవరైనా సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవాలని ఆమె సూచించారు. కాగా ప్రస్తుతానికి కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తన పట్టు కోల్పోయిందని చెప్పాలి… పంజాబ్‌లో అమరీందర్‌-సిద్ధూ ఘర్షణ క్లైమాక్స్‌కు చేరింది. తెలంగాణలో పార్టీ సీఎల్పీయే విలీనమైపోయే పరిస్థితి ఏర్పడింది. కర్ణాటకలో గొడవలు పెరుగుతున్నాయి. ఇదే పరిస్థితి ఇంకా కొనసాగితే మాత్రం పార్టీ బలమైన నాయకులందరూ కూడా బీజేపీ వైపు వెళ్లనున్నారని అర్థమవుతుంది.