ముగింపు దశకు కంప్యూటరీకరణ

Tuesday, September 9th, 2014, 07:05:25 PM IST

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను సంక్షేమ పధకాలకు అనుసంధానం చెయ్యాలని తెరాస సర్కారు నిర్ణయించినట్లుగా సమాచారం తెలుస్తోంది. కాగా సమగ్ర కుటుంబ సర్వే వివరాల నమోదును వేగవంతం చేసిన ప్రభుత్వం దాదాపు అన్ని జిల్లాలలోనూ కంప్యూటరైజేషన్ ప్రక్రియను ముగింపు దశకు తీసుకువచ్చింది.

ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో మాత్రం కంప్యూటరైజేషన్ ప్రక్రియ మరికొన్ని రోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అలాగే సర్వే వివరాలను సమగ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా కంప్యూటరైజ్ చేసిన తర్వాతే ప్రభుత్వం పధకాలతో అనుసంధానం చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో సర్వే వివరాల కంప్యూటరైజేషన్ వేగవంతం చెయ్యాలని ఆదేశించిన ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణిపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. కాగా మెదక్ జిల్లాలో మాత్రం ఉపఎన్నికల తర్వాత మాత్రమే సమగ్ర కుటుంబ సర్వే వివరాలను కంప్యూటరీకరణ చెయ్యాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.