సీఎల్పీ విలీనం పై కోర్టుకెక్కిన కాంగ్రెస్ – లెక్క తేలేనా…?

Tuesday, June 11th, 2019, 03:12:15 AM IST

తెరాస శాసనసభ పక్షంలో సీఎల్పీ విలీనం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు సవాల్ చేస్తూ హైకోర్టు ని ఆశ్రయించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి జారీచేసిన సీఎల్పీ విలీనం ఉత్తర్వుల్ని రద్దు చేయాలని కాంగ్రెస్‌ నేతలు ఫిర్యాదు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ కి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను విలీనం చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని, కొందరు కాంగ్రెస్ నేతలు కోర్ట్ లో ఫిర్యాదు చేశారు. సీఎల్పీ తీర్మానం లేకుండానే కేవలం 12 మంది ఎమ్మెల్యేల కోరిక మేరకు స్పీకర్ దాన్ని ఆమోదించడం చట్టబద్ధంగా లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఆ నిర్ణయాన్ని కొట్టేయాలని, ఈ విషయం పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. కాగా టీఆర్ఎస్ నేతలు మాత్రం స్పీకర్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఇందులో రాజ్యాంగ విరుద్ధంగా ఏమీ జరగలేదనీ, కాంగ్రెస్ పార్టీ గతంలో ఇలాంటి ఫిరాయింపులు, విలీనాలను ప్రోత్సహించినప్పుడు ఈ నియమాలూ, నిబంధనలూ గుర్తుకు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ గొడవ ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి ఇక.