మోడీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

Thursday, June 13th, 2019, 04:00:14 AM IST

కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం ఎవరు ఊహించని విధంగా మరొక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకుంది. మనదేశ రాజధాని ఢిల్లీతో సహా ప్రధాన నగరాల్లో రక్షణ వ్యవస్థలను కట్టుదిట్టం చేస్తున్న మోడీ ప్రభుత్వం తాజాగా మరొక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. దేశ సైనిక సామర్థ్యాలను శత్రుదుర్భేద్యంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కొత్త స్పేస్‌ ఏజెన్సీ ఏర్పాటు చేయాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకుంది. అంతరిక్షంలో ఎదురయ్యే కొత్త సవాళ్ళను ఎదుర్కొనేందుకు అవసరమైనటువంటి అధునాతన ఆయుధ వ్యవస్థను మరియు సాంకేతికతను మెరుగుపరచాలని, కొత్త ఏజెన్సీ సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కోవాలని నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోడీ సహకారంతో భద్రతా వ్యవహారాల మంత్రివర్గ కమిటీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది. అంతరిక్షంలో సవాళ్లు, భవిష్యత్తు ఇబ్బందులు, వాటిని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అందులోభాగంగా డిఫెన్స్ స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ పేరుతో నూతన వ్యవస్థ ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టనున్నారు.

ఈమేరకు బెంగళూరులో ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ ర్యాంక్‌ అధికారి పర్యవేక్షణలో డిఫెన్స్‌ స్పేస్‌ ఏజెన్సీని రూపొందించనున్నారు. ఈ ఏజెన్సీలో త్రివిధ దళాల అధికారుల సహకారంతో కలిసి పరిశోధనలు సాగించే శాస్త్రవేత్తల బృందం రక్షణగా ఉంటుంది. ఇందులో డిఫెన్స్ స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీకి రూపురేఖలు తీసుకొచ్చేందుకు పనులని ముమ్మరం చేశారు. అంతేకాకుండా ఈ ఏడాదిలోనే ఉపగ్రహ విధ్వంస క్షిపణి పరీక్షను విజయవంతంగా పరీక్షించింది. అందువల్ల యుద్ధ సమయాల్లో భారత ఉపగ్రహాల జోలికి శత్రువులు ప్రయోగాలు చేయకుండా అడ్డుకోగలిగామని చెబుతున్నారు.