ముదురుతున్న విద్యుత్ కష్టాలు!

Wednesday, October 15th, 2014, 11:16:00 AM IST

Power
తెలంగాణలో విద్యుత్ కొరత రోజు రోజుకు ముదిరి పాకాన పడుతోంది. ఇప్పటికే ప్రభుత్వం విధిస్తున్న కోతల నేపధ్యంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న తెరాస సర్కారు ఇంకా విద్యుత్ కోతలు పెంచే అవకాశముంది. అయితే తెలంగాణలో సెప్టెంబర్ మొదటి వారంలో 3.49మిలియన్ యూనిట్లు ఉన్న విద్యుత్ కొరత సెప్టెంబర్ 23వ తేదీకి 10.86మిలియన్లు గణనీయంగా పెరిగింది. ఇక సెప్టెంబర్ 27నాటికి విద్యుత్ లోటు 20మిలియన్లు దాటగా 29వ తేదీకి 32మిలియన్ల లోటుకు దూసుకెళ్లింది. అటుపై అక్టోబర్ 12నాటికి 29.79మిలియన్లకు తగ్గి ఆ తర్వాత ఒక్కసారిగా 42మిలియన్ యూనిట్ల లోటుకు పెరిగింది. దీనితో విద్యుత్ అధికారులు ఒక్కసారిగా ఇంత డిమాండ్ ఎందుకు పెరిగిందో అర్ధం కాక షాక్ కు గురవుతున్నారు.

ఇక ఇప్పటికే తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు 4గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా జరుగుతుండగా రాజధాని నగరం హైదరాబాద్ లో 4 గంటలు కనీస కోతను విధిస్తున్నారు. అయితే ఇదే పరిస్థితి గనుక కొనసాగితే భవిష్యత్తు మరింత అంధకారం అవుతుందని విద్యుత్ సంస్థలు బెంబేలెత్తుతున్నాయి. ఇక ములిగే నక్కపై తాటిపండు పడిన చందాన ఆంధ్రప్రదేశ్ లో హుధుద్ తుఫాను ప్రభావంతో సింహాద్రిలో విద్యుదుద్పత్తి ఆగిపోవడంతో తెలంగాణకు రావాల్సిన 560మెగావాట్ల విద్యుత్ సరఫరా నిలచిపోయింది. దీనితో నాగార్జున సాగర్, శ్రీశైలం కేంద్రాలలో పూర్తి స్థాయి విద్యుదుత్పాదనకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.