అప్పట్లో జన్మభూమి కమిటీలు ..ఇప్పట్లో వలంటీర్లు …అదే కంపు

Thursday, July 18th, 2019, 07:48:24 AM IST

ప్రజలకు మెరుగైన సేవ చేయటానికి, వాళ్ళకి గవర్నమెంట్ ఆఫీస్ లు చుట్టూ తిరిగే పని లేకుండా చేయటానికి గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేశాడు. ప్రతి ఊరికి ఒక కమిటీ ఉండేది, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అన్ని విషయాలు వాళ్లే చూసుకునేవాళ్ళు , ఈ క్రమంలో ప్రజా సేవ అనేది పక్కకి వెళ్ళిపోయి, ప్రజల దగ్గర దోపిడీ ఎక్కువయ్యింది. ప్రతి చిన్న పనికి లంచం కావలసిందే, అది ఏ స్థాయికి వెళ్లిందంటే మొన్న ఎన్నికల్లో టీడీపీ ఘోరపరాజయానికి జన్మభూమి కమిటీలు ప్రధాన కారణమని స్వయంగా జయప్రకాశ్ నారాయణ వంటి ప్రముఖులు చెప్పారంటే అర్ధం చేసుకోండి.

ఇప్పుడు జగన్ ప్రభుత్వం అదే ఆలోచనతో ప్రభుత్వ పధకాలు ప్రజల దగ్గరకి నేరుగా చేరాలనే వలంటీర్లను నియమిస్తుంది. ఇందులో మొదటి నుండే పెద్ద ఎత్తున అవినీతి,అక్రమాలు కనిపిస్తున్నాయి. కులం,పార్టీలతో సంబంధం లేకుండా అర్హత కలిగిన వాళ్ళకి వలంటీర్ పోస్ట్ ఇస్తామని చెప్పి నోటిఫికేషన్ విడుదల చేశారు. గ్రామాల్లోని నిరుద్యోగులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇక్కడ అర్హత అనే విషయాన్నీ పక్కన పెట్టేసి కేవలం వైసీపీ సానుభూతి పరులకే ఇస్తున్నారు. దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా కానీ ఎవరు పట్టించుకోవటం లేదు.

వలంటీర్ పోస్టులు కోసం ఎమ్మెల్యే ఆఫీస్ చుట్టూ పెద్ద ఎత్తున తిరుగుతున్నారు. అందుకు తగ్గట్లే స్థానిక ఎమ్మెల్యే సిపారస్సుతో పోస్టులు ఇస్తున్నారు. ఇదేమిటని అడిగితే రాకరాక అవకాశం వస్తుంది, పార్టీలోని వాళ్ళకి న్యాయం చేయాలికదా..నెలకి ఐదువేలు ఇస్తున్నారు, వాటిని పక్కవాళ్ళకి ఎందుకు ఇవ్వాలంటూ మాట్లాడుతున్నారు. దీనిపై మిగిలిన అభ్యర్థులు మాట్లాడుతూ తమ పార్టీ వాళ్ళకే ఇచ్చుకునే పనికైతే డైరెక్ట్ గా ఇచ్చుకోవచ్చుగా, ఆలా కాకుండా నోటిఫికేషన్ ఇవ్వటం ఎందుకంటూ విమర్శలు చేస్తున్నారు. ఆదిలోనే హంసపాదు అన్నట్లు, మొదటిలోనే ఇన్ని అక్రమాలు జరుగుతున్నా ఈ వలంటీర్ వ్యవస్థలో, మున్ముందు ఇంకెన్ని జరుగుతాయో చూడాలి.