అక్కడ ‘కాలా’ రిలీజ్ అవ్వడం కష్టమే!

Sunday, May 27th, 2018, 07:35:27 PM IST

సూపర్ స్టార్ రజిని కాంత్ హీరోగా కబాలి చిత్ర దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో త్వరలో విడుదలకు సిద్ధంగా వున్న చిత్రం కాలా. ఇటీవల ఎంతో వైభవంగా చెన్నైలో ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. కాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో ఈ నెల 29 న జరగనుంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం కర్ణాటకలో విడుదలవడం కష్టమేనట. తమిళనాడులో కావేరి జలాల వివాదం ఎప్పటినుండో జరుగుతోంది. అయితే ఇటీవల తమిళనాడులో ఈ వివాదానికి సంబంధించి నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం, అంతేకాక తమిళనాడు ప్రజలకు మద్దతుగా మాట్లాడడంతో గ్రహించిన కన్నడిగులు ఆయనపై నిప్పులు చెరుగుతున్నారు. స్వతహాగా కన్నడిగుడు అయిన రజిని తమ రాష్ట్రాన్ని కించపరిచారని, ఆయన నటించిన కాలా చిత్రాన్ని అక్కడ విడుదల కానివ్వమని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అక్కడి కన్నడ చిత్ర సంఘాలు కూడా ఒక నిర్ణయానికి వచ్చాయని సమాచారం.

కేవలం రజినివే కాకుండా లోకనాయకుడు కమల్ నటించిన చిత్రాలు కూడా అక్కడ విడుదల కానివ్వమంటున్నారు. అయితే ఇదివరకు నటుడు సత్యరాజ్ కర్ణాటకకు వ్యతిరేకంగా మాట్లాడాడని ఆయన నటించిన బాహుబలి ది కంక్లూజన్ చిత్రాన్ని అక్కడ విడుదల చేయబోమని అక్కడి చిత్ర సంఘాలు ప్రకటించడంతో, వెంటనే రంగంలోకి దిగిన దర్శకుడు రాజమౌళి మెల్లగా సర్ది చెప్పి ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు. నిజానికి రజినీకి కన్నడలో మంచి మార్కెట్ వుంది. ఆయన చిత్రాలు అక్కడ పదుల కోట్లలో కలెక్షన్లు సాధిస్తుంటాయి. మరి ఇటువంటి సమయంలో ఈ చిత్రాన్ని అక్కడ అడ్డుకోవడంతో చిత్ర నిర్మాతలు ధనుష్ అండ్ కో ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి…..

  •  
  •  
  •  
  •  

Comments