బిగ్ రికార్డ్: వైసీపీలో ఆ ముగ్గురు అన్నదమ్ముళ్ళు ఒకేసారి అసెంబ్లీలోకి..!

Thursday, June 13th, 2019, 10:04:09 AM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ విజయపరంపర మోగించి ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. 2014 ఎన్నికలలో ఓటమిపాలైనా ఈ సారి మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగాను 151 అసెంబ్లీ స్టానాలను గెలుచుకుని సరికొత్త రికార్డ్‌ను నెలకొల్పింది వైసీపీ.

అయితే ఈ ఎన్నికలలో వైసీపీ గెలుపే కాకుండా మరో అరుదైన రికార్డ్ కూడా ఉంది. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ఒకే కుటుంబం, సొంత అన్నదమ్ములు ముగ్గురు ఒకేసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు అంతేకాదు నిన్న ముగ్గురు అన్నదమ్ములు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం కూడా చేసారు. అయితే దేశ రాజకీయ చరిత్రలోనే ఇలాంటి రికార్డ్ తొలిసారి అనే చెప్పాలి. కర్నూల్ జిల్లా ఆదోని నుంచి పోటీ చేసిన ఎల్లారెడ్డి సాయిప్రసాద్ రెడ్డి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన సోదరుడు కర్నూల్ జిల్లాలోని మంత్రాలయం నుంచి ఎల్లారెడి బాలనాగి రెడ్డి కూడా రెండో సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన మరో సోదరుడు ఎల్లారెడ్డి వెంకత్ట్రామి రెడ్డి అనంతపురం జిల్లా గుంతకల్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ ముగ్గురు కూడా ఒకే పార్టీ నుంచి పోటీ చేసి ఒకేసారి చట్టసభల్లో అడుగుపెట్టారు. ఈ ముగ్గురు వైసీపీ నుంచి గెలిచి దేశ రాజకీయాలలోనే అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నారు ఈ ముగ్గురు బ్రదర్స్.