ట్రైల‌ర్ : ఆంగ్లేయులపై థ‌గ్స్ భీక‌ర యుద్ధం

Thursday, September 27th, 2018, 02:56:42 PM IST

2018 మోస్ట్ అవైటెడ్ మూవీ `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్‌` దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ 8న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. య‌శ్‌రాజ్ ఫిలింస్ సంస్థ ఇండియాస్ బెస్ట్ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నామ‌ని ప్రక‌టించింది. బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్‌, మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌, క‌త్రిన కైఫ్‌, స‌నా షేక్ వంటి భారీ తారాగ‌ణంతో `ధూమ్ 3` ఫేం విజ‌య్ కృష్ణ ఆచార్య ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. హాలీవుడ్, బాలీవుడ్ సాంకేతిక నిపుణులు ప‌ని చేస్తున్న ఈ సినిమా ట్రైల‌ర్ ఎలా ఉండ‌బోతోందో? అన్న ఉత్కంఠ ఇటీవ‌ల క‌నిపించింది.

తాజాగా రిలీజైన ట్రైల‌ర్ రోమాలు నిక్క‌బొడిచే రేంజులో ఉత్కంఠ రేకెత్తించింది. విజువ‌ల్స్‌లో భారీ గ్రాండియారిటీ, స‌ముద్రం, ఓడ‌ల నేప‌థ్యం, అలానే నాటి రాచ‌రికం నేప‌థ్యంలో మ‌హ‌దాద్భుతం అనిపించింది. ముఖ్యంగా బిగ్‌బి అమితాబ్‌, అమీర్ ఖాన్ కాస్ట్యూమ్స్ స‌హా నాటి థ‌గ్స్ రూపాలు ఆక‌ట్టుకున్నాయి. ఇక 225 ఏళ్ల క్రితం ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్లు భార‌త‌దేశంలో అడుగుపెట్టి సాగించిన మార‌ణ కాండ‌.. ఆయుధాల అమ్మ‌కం పేరుతో ఇక్క‌డ అడుగుపెట్టి సంప‌ద‌ల్ని దోచుకునేందుకు సాగించిన దుష్ట‌ఫ‌ర్వం ట్రైల‌ర్‌లో చూపించారు. వ్యాపారం పేరుతో దోపిడీ సాగించే దుష్టుల అంతు చూసేందుకు ఒక ఆజాద్ కావాలి. అత‌డే అల్లా భ‌క్ష్ అమితాబ్ బ‌చ్చ‌న్‌. అత‌డిని ఓ థ‌గ్ గా చూస్తుంది ఆంగ్లేయ ప్ర‌భుత్వం. అలాగే స‌నా షేక్ పాత్రలోని వీర‌త్వం ఓ స‌ర్‌ప్రైజ్‌. ఇక‌పోతే వీట‌న్నిటి న‌డుమ అమీర్ ఖాన్ ఎంట్రీ అంతే ఆస‌క్తి రేకెత్తించింది. ఆంగ్లేయుల‌కు స‌న్నిహితుడిగా ఉంటూనే గొయ్యి త‌వ్వే ఫిరంగి పాత్ర‌లో అమీర్ ఎంట్రీ అదిరిపోయింది. అమితాబ్ అలియాస్ ఆజాద్ న‌మ్మిన బంటుగా అమీర్ పాత్ర ఆక‌ట్టుకుంది. ఇక ఇందులో క‌త్రిన కైఫ్ హొయ‌లు, నాగిని నృత్యం కుర్ర‌కారుకు మ‌స్తు మ‌జా చేయ‌డం ఖాయమ‌ని అర్థ‌మ‌వుతోంది. ఓవ‌రాల్‌గా బాహుబ‌లి త‌ర్వాత మ‌ళ్లీ ఆ రేంజును వీక్షించ‌బోతున్నామ‌ని అర్థ‌మ‌వుతోంది. అందుకే య‌శ్‌రాజ్ ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్‌, మ‌ల‌యాళం స‌హా అన్ని ప్రాంతీయ భాష‌ల్లోనూ రిలీజ్ చేసి భారీగా క్యాష్ చేసుకునే ప్లాన్ చేస్తోంది. హిందీ ట్రైల‌ర్ వ‌చ్చింది కాబ‌ట్టి తెలుగు, త‌మిళ ట్రైల‌ర్లు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయ‌న్న‌మాట‌.