ట్రైల‌ర్ వండ‌ర్‌ : అంత‌రిక్షంలో అద్భుత విన్యాసాలు

Thursday, January 18th, 2018, 10:36:19 PM IST

100ఏళ్ల భార‌తీయ సినిమాలో, 90 ఏళ్ల మ‌ద్రాసు ఇండ‌స్ట్రీలో.. 88 ఏళ్ల టాలీవుడ్ ప్రాప‌కంలో.. ఎన్న‌డూ క‌నీవినీ ఎరుగ‌ని ప్ర‌యోగమే ఇది. అంత‌రిక్షం నేప‌థ్యంలో సినిమా అంటే అది ఏ హాలీవుడ్‌కో చెంది ఉంటుంది అని భావిస్తాం. కానీ ఇక‌మీద‌ట స్పేస్ బేస్డ్ సినిమాల‌కు మ‌న‌మే కేరాఫ్ అడ్రెస్ కాబోతున్నామ‌ని నిరూపిత‌మ‌వుతోంది. అస‌లు ఏ త‌ర‌హా సినిమాని అయినా మ‌నం తీయ‌గ‌లం అని భ‌రోసాని ఇచ్చే స‌న్నివేశం వ‌చ్చేసింది. బాహుబ‌లి త‌ర్వాత అన్నీ మారిపోయాయి. ఆకాశ‌మే హ‌ద్దుగా బ‌డ్జెట్ల‌లో వెన‌కాడ‌కుండా సౌత్‌లో సినిమాలు తెర‌కెక్కుతున్నాయి. బాలీవుడ్ త‌ల‌ద‌న్నే సినిమాలు ఇక మ‌న ప‌రిశ్ర‌మ‌ల్లోనూ తెర‌కెక్కుతుండ‌డం కొత్త ప‌రిణామం. బాలీవుడ్‌, హాలీవుడ్‌ని త‌ల‌ద‌న్నే సినిమాలు ఇక మ‌న‌వాళ్లు తెర‌కెక్కిస్తుండ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

అందులో తొలి అడుగు `బాహుబ‌లి` సిరీస్ అయితే, మ‌లి అడుగులో `టిక్ టిక్ టిక్‌` చిత్రం ఆ పేరు నిల‌బెడుతుంద‌నే అంచ‌నాలేర్ప‌డుతున్నాయి. అంత‌రిక్షం.. వ్యోమ‌గాములు.. భూమిపైకి దూసుకొచ్చే ఉల్కాపాతం.. దానిని స్పేస్‌లోనే అంతం చేసే స్కెచ్.. ఆ క్ర‌మంలోనే హీరో ఎదుర్కొనే ఊహించ‌ని ప‌రిణామాలు.. ఇదంతా వింటుంటేనే ఒళ్లు గ‌గుర్పొడుస్తోంది. జ‌యం ర‌వి న‌టించిన టిక్ టిక్ టిక్ ట్రైల‌ర్ చూస్తుంటేనే మైండ్ బ్లోయింగ్ అని పొగిడేయ‌ని వాడు ఉండ‌డు. ఇదివ‌ర‌కూ రిలీజైన టీజ‌ర్ సైతం అంతే రక్తి క‌ట్టించింది. ఈ సినిమాని ఈనెల 26న తెలుగు, త‌మిళం, హిందీలో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ్ చేస్తున్నారు. ఇక విశాఖ లో భూభాగాన్ని ఢీకొట్టే ఉల్క అంటూ మ‌రింత ఆస‌క్తి రేకెత్తించారు తెలుగు వెర్ష‌న్‌కి. హాలీవుడ్‌లో స్పేస్ ఒడిస్సీ, గ్రావిటీ వంటి చిత్రాలు ఇదే బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కి సంచ‌ల‌న విజ‌యం సాధించాయి. ఇండిపెండెన్స్ డే లాంటి స్పేస్ బేస్డ్ ఫిక్ష‌న్ సినిమా రిలీజైంది. అదే త‌ర‌హాలో సాగుతున్న ఓ ఉద్విగ్న‌భ‌రిత చిత్రం టిక్ టిక్ టిక్ అని అర్థ‌మ‌వుతోంది. యువ‌హీరో సాయిధ‌ర‌మ్ స్వ‌యంగా టిక్ టిక్ టిక్ ట్రైల‌ర్‌ని లాంచ్ చేశారు. శ‌క్తి సౌంద‌ర రాజ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ ఫిలింస్ ప‌తాకంపై చ‌ద‌ల‌వాడ పద్మావ‌తి ఈ చిత్రాన్ని తెలుగువారికి అందిస్తున్నారు.