తమిళనాడు లో జల్లికట్టు లాంటి మరొక ఉద్యమం సిద్దం

Friday, February 10th, 2017, 11:35:28 AM IST


నోరు కూడా విప్పని వ్యక్తులు ఒక్కసారిగా నోరు విప్పితే ఎలా ఉంటుందో తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ ని చూస్తే అర్ధం అవుతుంది. నోరు కూడా తెరవని ఆయన ఒక్కసారిగా విశ్వరూపం ప్రదర్శించారు. ఆయన మాటల తూటాలకి తెగువకీ దిక్కార స్వరానికీ శశికళ ఆమె వర్గం అందరూ ఒక్కసారిగా బిత్తర పోయారు. మరొక వైపు తమిళనాట పన్నీర్ కి భారీగా మద్దతు పెరుగుతోంది. శశి ముఖ్యమంత్రి అవ్వడం తమకి ఇష్టం లేదు అనీ అమ్మ నమ్మిన బంటుగా పేరున్న పన్నీర్ మాత్రమే ముఖ్యమంత్రి అవ్వాలి అంటూ మీడియా లో లక్షలాది మంది గొడవ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, చెన్నైలోని మెరీనా బీచ్ లో పన్నీర్ కు మద్దతుగా ఆందోళనలు, ఉద్యమాలు జరిగే అవకాశాలు ఉన్నాయని పోలీసు శాఖ భావిస్తోంది. జల్లికట్టు కోసం జరిగినంత ఉద్ధృతంగా ఈ ఆందోళనలు కూడా ఉంటాయని పోలీసు అధికారులు భావిస్తున్నారు. దీంతో, మెరీనా బీచ్ వద్ద భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు.