భారత్‌లో కరోనా ఉగ్రరూపం.. గడిచిన 24 గంటల్లో 2 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు..!

Thursday, April 15th, 2021, 02:00:09 PM IST

india_corona

భారత్‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతుంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. గతంలో ఎన్నడూ లేనంతగా నిన్న ఏకంగా 2 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతమున్న పరిస్థితులను బట్టి చూస్తుంటే మన దేశంలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పుతున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదే కంటిన్యూ అయితే దేశ వ్యాప్తంగా మళ్ళీ లాక్‌డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో దేశంలో 2,00,739 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన పడి కొత్తగా 1,038 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,40,74,564కి చేరింది. అయితే ప్రస్తుతం అందులో 14,71,877 యాక్టివ్ కేసులు ఉండగా, 1,24,29,564 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటివరకు మొత్తం 1,73,123 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో దేశంలో మొత్తం 93,528 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 88.3 శాతం ఉండగా, మరణాల రేటు 1.2 శాతంగా ఉన్నట్టు తెలుస్తుంది.