తెలంగాణలో నేడు ఒక్కరోజే 5 మంది మృతి.. కొత్తగా 38 కరోనా కేసులు..!

Thursday, May 21st, 2020, 09:21:52 PM IST

తెలంగాణలో గత కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ పోతుంది. అయితే నేడు కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం నేడు 38 కేసులు నమోదు అయ్యాయి. అయితే కరోనా బారిన పడి నేడు ఐదు మంది మృతి చెందగా, కరోనా నుంచి కోలుకుని 23 మంది డిశ్చార్జ్ అయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలో నేడు కేవలం 26 కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 2 కేసులు, వలస కూలీలలో 10 మందికి కరోనా సోకినట్టు తేలింది.

అయితే తాజా లెక్కలతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1699 కి చేరగా, 1036 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇటు మరణాల సంఖ్య మొత్తం 45కి చేరింది. అయితే వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాలలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని, మరో 26 జిల్లాలలో గత 14 రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.