తెలంగాణలో కరోనా విజృంభణ.. నేడు 920 పాజిటివ్ కేసులు..!

Thursday, June 25th, 2020, 11:39:40 PM IST

తెలంగాణలో రోజు రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతుంది. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నేడు ఒక్కరోజే 920 కొత్త కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి నేడు మరో 5 మంది చనిపోయారు.

అయితే ఇవాళ ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 737 కేసులు నమోదు కాగా, రంగారెడ్డిలో 86 కేసులు, మేడ్చల్‌లో 60 కేసులు, కరీంనగర్‌లో 13 కేసులు, రాజన్న సిరిసిల్లలో 4 కేసులు, మహబూబ్‌నగర్, నల్గొండలో మూడేసి కేసులు, ములుగు, వరంగల్ అర్బన్, మెదక్‌లో రెండేసి కేసులు, వరంగల్ రూరల్, కామారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, జనగాం, మహబూబాబాబ్, అదిలాబాద్, అసిఫాబాద్‌లో ఒక్కో కేసు నమోదు అయ్యింది. ఇక తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,364కి చేరగా, కరోనా నుంచి కోలుకుని 4,688 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 6,446 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 230కి చేరింది.

ఇదిలా ఉంటే ఈ రోజు మొత్తం 3,616 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా అందులో 2,696 మందికి నెగిటివ్ రాగా, 920 మందికి పాజిటివ్ వచ్చినట్టు హెల్త్ బులెటిన్ ద్వారా తెలిపింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 70,934 టెస్ట్‌లు చేసినట్లు తెలుస్తుంది.