తెలంగాణలో కరోనాతో నేడు 7 మంది మృతి.. కొత్తగా 945 కేసులు..!

Tuesday, June 30th, 2020, 11:08:50 PM IST


తెలంగాణలో దిన దినానికి కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నేడు కూడా కొత్తగా మరో 945 కేసులు నమోదు అయ్యాయి. ఇకపోతే కరోనా బారిన పడి నేడు మరో 7 మంది చనిపోగా, కరోనా నుంచి కోలుకుని నేడు ఒక్కరోజే 1712 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అయితే ఇవాళ ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 869 కేసులు నమోదు కాగా, రంగారెడ్డిలో 29 కేసులు, సంగారెడ్డిలో 21 కేసులు, మేడ్చల్‌లో 13 కేసులు, నిర్మల్‌లో 4 కేసులు, కరీంనగర్, మహబూబ్‌నగర్‌లో రెండేసి కేసులు, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మం, వికారాబాద్, నిజామాబాద్‌లో ఒక్కో కేసు నమోదయ్యింది. ఇక తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,339కి చేరగా, కరోనా నుంచి కోలుకుని 7,294 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 8,785 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 260కి చేరింది.

ఇదిలా ఉంటే ఈ రోజు మొత్తం 3,457 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా అందులో 2,512 మందికి నెగిటివ్ రాగా, 945 మందికి పాజిటివ్ వచ్చినట్టు హెల్త్ బులెటిన్ ద్వారా తెలిపింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 88,563 టెస్ట్‌లు చేశారు.