టాలీవుడ్ జంప్‌ : బీచ్ సొగ‌సుల విశాఖ‌కే ఆస్కారం!

Wednesday, November 15th, 2017, 01:17:24 AM IST

తెలుగు చలనచిత్ర పరిశ్రమ విశాఖ లేదా అమ‌రావ‌తికి త‌ర‌లించే అంశాన్ని సీరియ‌స్‌గా ప‌రిశీలిస్తున్నామ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టించారు. విశాఖ, అమరావతిలో ఎక్కడికి తరలించాలన్న అంశంపై అన్ని వర్గాలతో సమాలోచన చేస్తున్నామని మంగళవారం సాయంత్రం తనను కలిసిన సినీ ప్రముఖులతో వ్యాఖ్యానించ‌డం సంచ‌ల‌న‌మైంది. సాగర నగరం విశాఖకు తరలించాలని మెజారిటీ ప్ర‌ముఖులు, సామాన్య జ‌నం కోరుతున్నారని, రానున్న కాలంలో అమరావతి నగరం ప్రపంచంలోని ఐదు ఉత్తమ నగరాలలో ఒకటి కానున్న నేపథ్యంలో సినీ పరిశ్రమ ఇక్కడ ఉంటేనే సమంజసంగా ఉంటుందని భావిస్తున్నామని చెప్పారు. అంతేకాదు.. ఏపీ క‌మ్యూనికేష‌న్స్ విభాగం కార్యాల‌య స‌ల‌హాదారు నుంచి అధికారికంగా ఓ ప్రెస్ రిలీజ్‌ని పంపించ‌డం విశేషం.

తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాదులో నిలదొక్కుకునేలా అక్కడ అన్ని మౌలిక సదుపాయాలను కల్పించామని, ఇప్పుడు సొంత రాష్ట్రానికి వస్తామని పరిశ్రమలోని అత్యధికుల నుంచి వస్తున్న వినతుల్ని దృష్టిలో ఉంచుకుని మళ్లీ ఇక్కడ పరిశ్రమను అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకున్నామని ముఖ్యమంత్రి అన్నారు. సహజ అందాలతో విలసిల్లే విశాఖ, గోదావరి జిల్లాలు తెలుగు, తమిళ సినిమాల షూటింగులకు ముఖ్య చిరునామాగా ఉండేదని గుర్తుచేశారు. విశాఖలో సినీ స్టూడియోలు నిర్మించేందుకు ఇప్పటికే అనేకమంది ముందుకు రావడం సంతోషదాయకమని చెప్పారు. విశాఖ, అమరావతిలో పరిశ్రమ ఎక్కడికి తరలివచ్చినా ఇబ్బంది లేదని, విశాఖ బ్యుటిఫుల్ రెడీమేడ్ సిటీ అయితే, అమరావతి ఫ్యూచర్ సిటీ అని అభివర్ణించారు. గ‌త కొంత‌కాలంగా హైద‌రాబాద్‌లోని సినీపెద్ద‌ల్లో ప‌రిశ్ర‌మ త‌ర‌లింపు విష‌య‌మై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంద‌న్న టాక్ వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు చేసిన ప్ర‌క‌ట‌న‌తో అన్ని సందేహాలు తొల‌గిపోయిన‌ట్టే. కాస్త స‌మ‌యం ప‌ట్టొచ్చేమో కానీ, టాలీవుడ్ విశాఖ లేదా అమ‌రావ‌తికి త‌ర‌లి వెళ్లే ఆస్కారం ఉంద‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments