టాలీవుడ్ బంద్ క్యాన్సిల్‌.. పెద్ద‌లు త‌లుచుకుంటే!?

Wednesday, January 31st, 2018, 03:00:17 AM IST

డిజిట‌ల్ ప్రొవైడ‌ర్ల అత్యాశ‌తో క్యూబ్‌, యూఎఫ్‌వో ఛార్జీల మోత మోగిపోతోంద‌ని, దానివ‌ల్ల నిర్మాత‌ల‌కు త‌ల‌కుమించిన భారం పెరిగిపోయింద‌ని ఇదివ‌ర‌కూ మ‌న నిర్మాత‌లంతా వాపోయారు. అంతేకాదు దీనిపై నిర్మాత‌ల మండ‌లి సాక్షిగా యుద్ధం చేస్తామ‌ని ఇదివ‌ర‌కూ డి.సురేష్‌బాబు స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ఆ క్ర‌మంలోనే మార్చి 1 నుంచి టాలీవుడ్ షూటింగుల‌న్నీ బంద్ చేస్తామ‌ని, సౌతిండియాలోని ప‌రిశ్ర‌మ‌ల‌న్నీ క‌లిసి క‌ట్టుగా ఏక‌తాటిపైకి వ‌చ్చి ఈ యుద్ధం చేస్తాయ‌ని తెలిపారు. అందుకు తెలుగు చ‌ల‌న‌చిత్ర వాణిజ్య మండ‌లి డిక్ల‌రేష‌న్ ఇచ్చింది. కానీ ఇంత‌లోనే అచ్చులో బొమ్మ తిర‌గ‌బ‌డింది. ముందే అనుకున్న బంద్ క్యాన్సిల్ అయ్యిందిట‌.

అయితే దీనికి కార‌ణ‌మేంటి? ఉన్న‌ట్టుండి ఇలా నిర్ణ‌యం వెన‌క్కి తీసుకోవడానికి కార‌ణ‌మేంటి? అంటే.. అందుకు ఈ రెండు మూడు నెల‌ల్లో రిలీజ్‌కి వ‌స్తున్న మూడు నాలుగు పెద్ద సినిమాలే కార‌ణ‌మ‌ని తెలిసింది. రంగ‌స్థ‌లం, నా పేరు సూర్య‌, భ‌ర‌త్ అనే నేను, 2.ఓ వంటి భారీ చిత్రాలు రిలీజ్‌ల‌కు వ‌స్తున్నాయి. బంద్‌లు, స్ట్రైక్‌లు అంటే ఈ సినిమాల రిలీజ్‌లు సందిగ్ధంలో ప‌డ‌తాయి. దానివ‌ల్ల నిర్మాత‌లు బోలెడంత న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంది. దాంతో పాటే ఇత‌ర సినిమాల రిలీజ్‌ల‌కు అది ఆటంకంగా మారుతుందన్న‌ది ఒక కోణం. అయితే ఈ సినిమాల‌న్నీ నిర్మించింది ఆ న‌లుగురు అగ్ర నిర్మాత‌లే కాబ‌ట్టి.. వాళ్ల సౌక‌ర్యం కోసం అంత పెద్ద యుద్ధాన్ని ఆపేస్తున్నార‌న్న అప‌ప్ర‌ద వినిపిస్తోంది. ఇంత‌కీ ఎవ‌రికోసం ఈ ప్ర‌య‌త్నం ఆప‌డం? అన్న‌దాంట్లో క్లారిటీ వ‌చ్చిందా?