సీఎం జగన్‌ని కలిసిన సినీ ప్రముఖులు.. కారణం అదే..!

Wednesday, February 26th, 2020, 07:32:13 PM IST

టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతల బృందం నేడు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. అయితే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేనివంశీతో పాటు నిర్మాతలు దగ్గుబాటి సురేష్, శ్యాంప్రసాద్‌రెడ్డి, జెమిని కిరణ్‌, నల్లమలుపు బుజ్జి తదితరులు సీఎం జగన్‌ని కలిశారు.

అయితే జగన్‌ని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన నిర్మాతల బృందం ఏపీలో హుద్‌హుద్ తుఫాన్ సంభవించినప్పుడు నివాసాన్ని కోల్పోయిన బాధితుల కోసం తెలుగు సినీపరిశ్రమంతా రెండు రోజుల పాటు అన్నికార్యక్రమాలు నిలిపివేసి, ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు టెలీథాన్‌ పేరుతో ప్రత్యేక షో నిర్వహించామని, ఆ షో నిర్వహణ ద్వారా వచ్చిన రూ.15 కోట్ల రూపాయలతో దాదాపు 320 ఇళ్లు నిర్మించిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చామన్నారు. అయితే ఆ ఇళ్ల నిర్మాణం ఇప్పుడు పూర్తైనందున వాటిని ప్రారంభించి హుద్ హుద్ సమయంలో ఇళ్లు కోల్పోయిన వారికి అందించాలని సీఎం జగన్‌కి విజ్ఞప్తి చేశామని, దానికి సీఎం జగన్ కూడా సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.