భ‌త్యం పెంపు పెద్ద సినిమాల‌వ‌ర‌కే!

Thursday, May 3rd, 2018, 10:20:59 PM IST


కార్మికుల‌కు జీత‌భ‌త్యాలు పెంచాల‌ని కొన్నేళ్లుగా తెలుగు సినీ కార్మిక స‌మాఖ్య (ఫెడ‌రేష‌న్‌) పోరాడుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ స‌మ‌స్య ప‌రిష్కారానికి నిర్మాత‌లు స‌సేమిరా అంటున్నారు. దీనిపై ఫిలింఛాంబ‌ర్ పెద్ద‌లంతా వ్య‌తిరేకంగానే ఉన్నారు. కూలీలు పెర‌గాల‌ని వీళ్లు, ప్రొడ‌క్ష‌న్ ఖ‌ర్చు త‌గ్గాల‌ని వాళ్లు ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న‌ట్టే అయిపోయింది. అయితే మొన్న‌టికి మొన్న లైట్‌మెన్ డిపార్ట్ మెంట్ మెరుపు స‌మ్మె చేయ‌డంతో చేసేది లేక ఫిలింఛాంబ‌ర్ పెద్ద‌లు ఫెడ‌రేష‌న్‌ని చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించారు. ఆ క్ర‌మంలోనే భ‌త్యాల పెంపు అనేదానిపై చ‌ర్చించారు. ఈ చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌మ‌య్యాయ‌ని తెలుస్తోంది.

భ‌త్యం పెంచేందుకు సినీపెద్ద‌లు కార్మిక‌సంఘానికి హామీ ఇచ్చారు. అయితే సినిమా స్థాయిని బ‌ట్టే ఈ పెంపు వ‌ర్తిస్తుంద‌న్న‌ది కండిష‌న్. పెద్ద సినిమాల‌కు కార్మికుల జీత‌భ‌త్యాలు పెంచేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. అయితే ఆ పెంచిన భ‌త్యం ఇవ్వాల‌ని చిన్న నిర్మాత‌ల్ని మాత్రం అడ‌గ‌కూడ‌ద‌న్న‌ది కండిష‌న్‌. చిన్న సినిమాలకు ఇప్పుడెలా ఇస్తున్నారో అలానే భ‌త్యం ఇవ్వాల‌న్న రూల్ పెట్టారు. అయితే ఈ రెండంచెల విధానం వ‌ల్ల కార్మికుల్లో కొంత క‌న్ఫ్యూజ‌న్ నెల‌కొంది. వాళ్ల‌కు పెంచారు.. మాకు పెంచ‌రా! అంటూ అప్పుడే కొత్త వివాదాలు రాజుకుంటున్నాయిట‌. అయితే వీట‌న్నిటినీ ప‌రిష్క‌రించుకోవాలంటే ఫిలింఛాంబ‌ర్ ప్ర‌తినిధుల్ని సంప్ర‌దించాల్సిందేన‌ని అంటున్నారు నిర్మాత‌, ఛాంబ‌ర్‌ అడ్‌హ‌క్ క‌మిటీ స‌భ్యులు మోహ‌న్‌గౌడ్‌. ఒక‌వేళ ఛాంబ‌ర్ స‌భ్యులు ఫోన్‌లు తీయ‌క‌పోతే తాను సాయం చేసేందుకు సిద్ధ‌మేన‌ని తెలిపారు.

Comments