ట్రైలర్ టాక్ : ‘టచ్ చేసి చూడు’..యూనిఫామ్ లో ఉంటే ఆరే బుల్లెట్లు..!

Thursday, January 25th, 2018, 08:09:16 PM IST

మాస్ మహారాజా రవితేజ మరో మాస్ ఎంటర్ టైనర్ తో మన ముందుకు వచ్చేస్తున్నాడు. ఇటీవల రాజా ది గ్రేట్ చిత్రంతో విజయాన్ని అందుకున్న రవితేజ ఫిబ్రవరి 2 న ‘టచ్ చేసి చూడు’ చిత్రంతో రాబోతున్నాడు. ఈ చిత్రానికి సంబందించిన థియేట్రికల్ ట్రైలర్ కొద్ది సేపటి క్రితమే విడుదలైంది. ట్రైలర్ చిత్రంపై ఆసక్తిని పెంచే విధంగా ఉంది. రవితేజ మార్క్ కామెడీ, మాస్ యాక్షన్ అంశాలు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణ కాబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది. రవితేజ బలం కూడా అదే. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే రవితేజ తనకు అచ్చొచ్చిన పోలీస్ గెటప్ లో దిగబోతున్నాడు. విక్రమార్కుడు, మిరపకాయ్ మరియు పవర్ వంటి చిత్రాల్లో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా ఆకట్టుకున్నాడు. ఆ చిత్రాలన్నీ విజయం సాధించాయి.

టచ్ చేసి చూడు ట్రైలర్ లో రవితేజ చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. యూనిఫామ్ లో ఉంటె ఆరే బుల్లెట్లు. యూనిఫామ్ తీసేస్తే రాయితో చంపుతానో రాడ్ తో చంపుతానో నాకే తెలియదు అంటూ రవితేజ మాస్ యాంగిల్ లో చెబుతున్న డైలాగ్ బావుంది. వెన్నెల కిషోర్ మరియు ఇతర కామెడీ గ్యాంగ్ తో రవితేజ మంచి హాస్యం పండించినట్లు కనిపిస్తోంది. సీరత్ కపూర్ మరియు రాశి ఖన్నా ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. విక్రమ్ సిరికొండ ఈ చిత్రానికి దర్శకుడు. రవితేజ మార్క్ మాస్ మాసాలని ఇష్టపడేవారు ఫిబ్రవరి 2 కోసం ఎదురు చూడవచ్చు.