అసెంబ్లీనీ ఫామ్‌హౌజ్‌కి మార్చాలనుకుంటున్నారు.. కేసీఆర్‌పై మండిపడ్డ ఉత్తమ్

Friday, June 7th, 2019, 12:31:07 PM IST

టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీన ప్రక్రియపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో కేసీఆర్‌పై మండిపడ్డారు. అయితే ఈ విలీన తీర్పు నిజంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని దీనికి నిరసనగా 36 గంటలపాటు ఇందిరాపార్కు వద్ద ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపడుతామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వద్ద, హైకోర్ట్ వద్ద అనర్హత పిటీషన్‌లు పెండిగ్‌లో ఉండగా శాసనసభాపక్షాన్ని ఎలా విలీనం చేస్తారని ఆయన ప్రశ్నించారు. అయితే విలీనంపై హైకోర్టులో పిటిషన్‌ వేయడంతో పాటు అవసరమైతే లోక్‌పాల్‌ను ఆశ్రయిస్తామని చెప్పారు.

అయితే ఒక పార్టీ అధ్యక్షుడిగా తన అనుమతి లేకుండా సీఎల్పీ సమావేశం ఎలా నిర్వహిస్తారని, అనర్హత కేసును ఎదుర్కుంటున్న ఎమ్మెల్యేలకు సీఎల్పీ సమావేశం నిర్వహించే అర్హత లేదని ఆయన అన్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీ చేసే అక్రమాలను, దోపీడీలను ప్రతిపక్షంగా ప్రశ్నిస్తామనే కేసీఆర్ ఈ విధంగా చేస్తున్నారని, కోట్లు ఖర్చు పెట్టి మరీ ఎమ్మెల్యేలను కొంటున్నారని ఉత్తమ్ చెబుతున్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును కాదని ప్రజాస్వామ్య వ్యవస్థను కొల్లగొట్టే పనిలో కేసీఅర్ ఉన్నారని ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నరని ఆయన ఆన్నారు. అంతేకాదు ప్రతిపక్షమనేదే లేకుందా ఉంటే అసెంబ్లీనీ కూడా తన ఫామ్‌హౌజ్‌లోనే పెట్టుకోవాలన్న ఆలోచనలు కేసీఆర్‌లో కనిపిస్తున్నాయని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. దీనిపై అసెంబ్లీ ముందు నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై 151 సెక్షన్‌ కింద కేసులు పెట్టి అరెస్ట్ చేయించడం అధికార పార్టీకి తగదని కూడా చెప్పుకొచ్చారు.