జియో కు షాక్ ఇచ్చిన ట్రాయ్

Tuesday, December 27th, 2016, 03:27:39 PM IST

jio
రిలయన్స్ జియో వస్తూ రావడంతోనే ప్రత్యర్థి కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చింది. 3 నెలల్లోనే సుమారుగా 6 కోట్ల మంది కస్టమర్లను సంపాదించి సంచలనం సృష్టించింది. మూడు నెలలపాటు ప్రారంభ ఆఫర్ గా వాయిస్ కాల్స్, డేటా సర్వీసులు ఉచితం అని చెప్పింది. దీంతో వినియోగదారులు జియో సిమ్ లను ఎగబడి కొన్నారు. ఇప్పుడు జియో మరొక సంచలన నిర్ణయం తీసుకుంది. తాను ఇచ్చిన ప్రారంభ ఆఫర్ ని మరొక మూడు నెలలు (మార్చి 31) పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ ప్రకటనపైనే ఇప్పుడు ట్రాయ్ జియో కు షాక్ ఇచ్చింది.

ఏ ప్రమోషనల్ ఆఫర్ అయినా మూడు నెలలు మించకూడదన్న నిబంధనను ఉచిత వాయిస్ కాల్స్, డేటా ఆఫర్ పెంపు ప్రకటనతో ఎందుకు ఉల్లంఘించారని జియో ను ట్రాయ్ ప్రశ్నించింది. హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ కింద జియో పాత కస్టమర్లకు, కొత్త కస్టమర్లకు కూడా ఉచిత వాయిస్ కాల్స్, డేటా సర్వీసులను పొడిగించిన వెంటనే ట్రాయ్ ఈ అస్త్రం సంధించింది. ఈ ఆఫర్ ను జియో పొడిగించిన వెంటనే దీనిని పరిశీలించిన ట్రాయ్ డిసెంబర్ 20న రాసిన లేఖలో దీనిని పోటీ నిరోధక చర్యగా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలని ప్రశ్నించింది. అంతేకాదు మార్చి 31 నాటికి ఇంకా ఎంత మంది వినియోగదారులు జత కాగలరని భావిస్తున్నారో చెప్పాలని కూడా ట్రాయ్ ఆదేశించింది. దీనిపై వివరణ ఇవ్వడానికి ఐదు రోజులు గడువు ఇచ్చింది.

  •  
  •  
  •  
  •  

Comments