ట్రైలర్ టాక్ : విశ్వరూపం-2…. కమల్ నట విశ్వరూపం

Monday, June 11th, 2018, 05:53:24 PM IST

లోకనాయకుడు కమల్ హాసన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పవలసింది ఏమి లేదు. ఆయన నటించిన ప్రతిచిత్రంలోని పాత్రల్లో కమల్ నటించరు, జీవిస్తారని పలువురి నుండి ఆయన అభినందనలు అందుకున్న సందర్భాలు ఎన్నో వున్నాయి. అటువంటి అద్భుత నటుడు కమల్ ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతుండడంతో తన పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు తన నూతన చిత్రం విశ్వరూపం-2 చిత్రాన్ని పూర్తి చేసారు. నేడు ఈ చిత్ర తెలుగు ట్రైలర్ ను నటుడు జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేస్తూ, ట్రైలర్ అద్భుతంగా ఉందని ట్వీట్ చేసారు. అయితే యూట్యూబ్ లో విడుదలయిన ఈ చిత్ర ట్రైలర్ చూసిన ప్రేక్షకులు మంత్రముగ్దులవుతున్నారు. ట్రైలర్ లో ఆద్యంతం దేశ ద్రోహం, మిలిటెంట్లు దాడి, సంఘవిద్రోహ శక్తులను ఎదుర్కోవడం వంటి పోరాట సన్నివేశాలను అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా ట్రైలర్ లో వచ్చే ఏ మతానికో కట్టుబడడంతో తప్పుకాదు బ్రదర్, కానీ దేశ ద్రోహానికి పాల్పడడం మాత్రం తప్పు అని అయన చెప్పే డైలాగ్ ఆలోచింపచేస్తుంది.

ఇకపోతే ట్రైలర్ లో పూర్తిగా యాక్షన్ సన్నివేశాలకు పెద్దపీట వేశారు. వహీదా రెహమాన్, శేఖర్ కపూర్, పూజ కుమార్, రాహుల్ బోస్, ఆండ్రియా తదితర నటులను మనం ట్రైలర్ లో చూడవచ్చు. మొత్తంగా ట్రైలర్ చూస్తే ఈ రెండవ భాగంపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి రేకెత్తుతుంది. అలానే కమల్ తన నట విశ్వరూపాన్ని ఈ చిత్రంలో కూడా చూపించి వుంటారని ట్రైలర్ ని బట్టి చూస్తే అర్ధమవుతోంది. ఆస్కార్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన ఈ చిత్రానికి కమల్ రచయిత మరియు దర్శకత్వం వహిస్తున్నారు. విశ్వరూపం మొదటి భాగం వలే ఇది కూడా ఏ మేరకు విజయం అందుకుంటుందో తెలియాలంటే విడుదల వరకు వేచివుండవలసిందే. కాగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఆగష్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది……

  •  
  •  
  •  
  •  

Comments