ట్రెండింగ్ : ఎన్టీఆర్ బయోపిక్ లో సూపర్ స్టార్ ?

Tuesday, April 10th, 2018, 02:53:46 PM IST

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’. నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం ఇటీవల అతిరధ మహారథుల సమక్షంలో ప్రారంభోత్సవం జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర అనౌన్స్ మెంట్ నుండి ప్రతిరోజు ఏదో ఒక ప్రత్యేక వార్త బయటకు వస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలో నందమూరి హరికృష్ణ పాత్రను ఆయన తనయుడు కళ్యాణ్ రామ్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆయన చైతన్య రథ సారథిగా కనిపించనున్నారట.

కాగా ప్రస్తుతం ఇతర నటీనటుల, సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ ఎంతో జాగ్రత్తగా జరుగుతోంది. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన ఒక వార్త ఫిలిం నగర్ వర్గాల్లో షికారు చేస్తోంది. అది ఏంటంటే ఈ చిత్రం లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక ప్రత్యేక పాత్రలో నటించనున్నారట. అది కూడా ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి నిజ జీవిత పాత్రలో అట. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ గా మారింది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే నందమూరి, ఘట్టమనేని నట వారసులను ఒకేతెరపై చూడవచ్చునన్నమాట!