ముక్కోణ‌పు పోటీలో గెలుపెవ‌రిది?

Monday, May 21st, 2018, 11:19:02 PM IST


ప్ర‌తి శుక్ర‌వారం ఏదో ఒక సినిమా రిలీజ‌వుతూనే ఉంటుంది. అయితే ఈ శుక్ర‌వారం(మే 25న‌) మాత్రం ఏకంగా మూడు సినిమాలు ఒక‌దానితో ఒక‌టి పోటీకి రెడీ అవుతున్నాయి. ఆస‌క్తిక‌రంగా ట్రేడ్‌లో ఈ మూడు సినిమాల‌పైనా పాజిటివ్ టాక్ ఉంది. ఒకేసారి మూడు సినిమాలు అంటే ఓపెనింగుల‌పై కాస్త ప్ర‌భావం చూపుతుంద‌న‌డంలో సందేహం లేదు. ముక్కోణ‌పు పోటీ వివ‌రంలోకి వెళితే..

మాస్ మ‌హారాజా ర‌వితేజ క‌థానాయ‌కుడిగా చైత‌న్య‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `నేల టిక్కెట్టు`పై భారీ అంచ‌నాలున్నాయి. మాస్‌రాజా స‌క్సెస్‌లో ఉన్నాడు. అలానే చైత‌న్య కృష్ణ వ‌రుస‌గా రెండు హిట్లు కొట్టి, హ్యాట్రిక్ కోసం త‌ప‌న‌తో చేశాడు ఈ సినిమా. ర‌వితేజ‌-మాళ‌విక శ‌ర్మ జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఆక‌ట్టుకోవ‌డం పెద్ద ప్ల‌స్‌. ఇక‌పోతే క‌ల్యాణ్‌రామ్ – త‌మ‌న్నా జంట‌గా జ‌యేంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `నా నువ్వే` కొత్త టోన్‌తో ఆక‌ట్టుకోనుంద‌ని ట్రైల‌ర్లు చెబుతున్నాయి. క‌ల్యాణ్‌రామ్ న్యూలుక్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాతో పాటు నాగ‌శౌర్య న‌టించిన `అమ్మ‌మ్మ‌గారిల్లు` ఈ శుక్ర‌వారం ఘ‌నంగా రిలీజ‌వుతోంది. `ఛ‌లో` లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టాక శౌర్య ఎంతో జాగ్ర‌త్త‌ప‌డుతున్నాడు. మ‌రోసారి ఆహ్లాద‌క‌ర‌మైన ఫ్యామిలీ సినిమాలో న‌టించాడ‌ని ట్రైల‌ర్ చెబుతోంది. అయితే అమ్మ‌మ్మ‌గారిల్లు ప్ర‌మోష‌న్స్‌లో వీక్ అన్న టాక్ ప‌రిశ్ర‌మ‌లో వినిపిస్తోంది. ఇత‌ర సినిమాల‌తో పోలిస్తే శౌర్య ప్ర‌మోష‌న్స్ స్పీడ్ అంతంత‌మాత్రంగానే క‌నిపిస్తోంది. ఈ వారం ముక్కోణ‌పు పోటీబ‌రిలో గెలుపుగుర్ర‌మెక్కేది ఎవ‌రు? అన్న‌ది తేల‌నుంది. అన్ని సినిమాల‌పైనా పాజిటివ్ టాక్ ముందే ఉంది. జాన‌ర్ ప‌రంగా వైవిధ్యం ఉంది కాబ‌ట్టి హిట్టు అన్న టాక్ వినిపిస్తే పోటీ ఉన్నా, ఓపెనింగుల‌కు ఆస్కారం ఉంటుంది. ఈ నాలుగు రోజులు వేచి చూడాల్సిందే.

  •  
  •  
  •  
  •  

Comments