ఈ ఉప ఎన్నిక‌లో తెరాస బాహాబాహీ ఖాయ‌మ‌నా?

Monday, June 3rd, 2019, 11:24:40 AM IST

తెలంగాణలో మ‌రో ఉప ఎన్నిక కీల‌కంగా మార‌బోతోంది. కొడంగ‌ల్ స్థానంలో రేవంత్‌రెడ్డిని ఓడించ‌డం కోసం భారీగానే క‌స‌ర‌త్తు చేసిన తేరాస శ్రేణులు మ‌ళ్ళీ అలాంటి క‌స‌ర‌త్తు చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారా? అంటే తెరాస శ్రేణులు నిజ‌మ‌నే చెబుతున్నాయి. పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిథ్యం వ‌హించిన హుజూర్‌న‌గ‌ర్‌లో ఉప ఎన్నిక‌ల అనివార్యంగా మారిన విష‌యం తెలిసిందే. ఈ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్త‌మ్ న‌ల్ల‌గొండ ఎంపీగా గెలిచిన విష‌యం తెలిసిందే. ఈ నెల 3న త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌బోతున్నారు. ఆ స్థానం నుంచి తెజ‌స అధినేత ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్ బ‌రిలోకి దిగ‌బోతున్నారు. అయితే ఈ ఎన్నిక‌ల ర‌స‌వ‌త్త‌రంగా మారే అవ‌కాశం వుంది, ఇక్క‌డి నుంచి తెరాస శానంపూడి సైదిరెడ్డిని రంగంలోకి దించుతోంది.

గ‌త ఎన్నిక‌ల్లో ఈ స్థానం నుంచి ఉత్త‌మ్‌కు పోటీగా నిలిచిన సైదిరెడ్డి స్వ‌ల్ప తేడాతో ఓట‌మిపాల‌య్యారు. ఈ ద‌ఫా ఎలాగైనా ఆ స్థానాన్ని ద‌క్కించుకోవాల‌ని తెరాస ప్లాన్ వేస్తోంది. స‌ర్వ‌శ‌క్తుల్ని ఒడ్డి ఎలాగైనా సైదిరెడ్డిని గెలిపించుకోవాల‌ని చూస్తోంది. ఇక్క‌డ గెల‌వ‌క‌పోతే, కోదండ‌రామ్ గెలిస్తే గ‌త కొంత కాలంగా కోదండ‌రామ్ పార్టీపై చేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు బ‌లం చేకూరిన‌ట్ట‌వుతుంది. ఇది ఎట్టిప‌రిస్థితుల్లో పార్టీకి మంచిది కాదు. పైగా పార్టీ ఇమేజ్ చాలా వ‌ర‌కు దెబ్బ‌తింటుంది. అది జ‌ర‌గ‌కూడ‌దంటే ఈ స్థానం నుంచి కోదండ‌రామ్ గెల‌వ‌కుండా సైదిరెడ్డి విజ‌యం సాధించాలి అని ప్లాన్ చేస్తున్నార‌ట. అయితే హుజూర్‌న‌గ‌ర్‌లో ఉత్త‌మ్‌ని కాద‌ని తెరాస గెల‌వ‌డం క‌ష్ట‌మే అంటున్నారు. పైగా ఇంట‌ర్మీడియ‌ట్ ర‌చ్చ ఈ ఎన్నిక‌ల్లో కోదండ‌రామ్‌కు బ్ర‌హ్మాస్త్రంగా ప‌నిచేస్తుంద‌ని, దాంతో ఆయ‌న రికార్డు మెజారిటీతో గెలిచినా ఆశ్చ‌ర్యం లేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.