ఆ రెండు పార్టీల పోరులో తెలంగాణలో మొత్తానికి బీజేపీ బలపడిందిగా..!

Monday, June 3rd, 2019, 03:25:25 PM IST

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళి టీఆర్ఎస్ వరుసగా రెండో సారి విజయం సాధించింది. అయితే గతంలో తెలంగాణ సెంటిమెంట్‌లో గెలిచిన సీట్ల కన్నా ఈ సారి ఎన్నికలలో కాస్త ఎక్కువ సీట్లనే గెలుచుకుంది. అయితే టీఆర్ఎస్ గతంలో కన్నా ఎక్కువ సీట్లు గెలవడానికి చాలానే కారణాలు ఉన్నా ఎక్కువ మాత్రం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకమే కారణమంటున్నారు. అయితే 2014లో కాంగ్రెస్ పార్టీ మిగులు రాష్ట్రంగా తెలంగాణను అప్పగిస్తే కేసీఆర్ మాత్రం 2018లోపు అప్పుల రాష్ట్రంగా మార్చారు. అయితే దీనిని గమనించిన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మాత్రం దానిని ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పడంలో కాస్త విఫలమైయ్యిందనే చెప్పాలి.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడం ఒక్క ఎత్తయితే కాంగ్రెస్ పార్టీ టీడీపీ, జనసమితిలతో పొత్తు పెట్టుకోవడం మరో ఎత్తు. కాంగ్రెస్ పార్టీ పొత్తుల నేపధ్యంలో ఎంతసేపు సీట్ల పంపకంపై దృష్టి పెట్టిందే తప్పా టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపడంపై దృష్టి సారించలేకపోయింది. ఫలితంగా 88 సీట్లతో టీఆర్ఎస్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంటే కాంగ్రెస్ మాత్రం 19 సీట్లకే పరిమితమైంది. అయితే గతంలో బీజేపీ మూడు నాలుగు స్థానాలను గెలుచుకున్నా ఈ సారి మాత్రం కేవలం ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. అయితే ఇంతలోపే తెలంగాణలో మళ్ళీ లోక్‌సభ ఎన్నికలు వచ్చేశాయి. అయితే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా కొంత మంది టీఆర్ఎస్‌లోకి వెళ్ళిపోవడంతో కాంగ్రెస్ పార్టీ కాస్త చతికిల పడింది. ఇదే అదునుగా చూసుకున్న బీజేపీ బలపడి ఏకంగా 17 లోక్‌సభ స్థానాలలో 4 స్థానాలను గెలుచుకుంది. టీఆర్ఎస్ పార్టీ 9 స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం 3 స్థానాలకే పరిమితమైంది. ఇందులో మరో ట్విస్ట్ ఏమిటంటే అసెంబ్లీ ఎన్నికలలో 88 స్థానాలను గెలుచుకున్న టీఆర్ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికలలో మాత్రం 71 స్థానాలలోనే మెజారిటీ సాధించింది. కాంగ్రెస్ 19 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటే ఈ సారి లోక్‌సభ ఎన్నికలలో మాత్రం 21 అసెంబ్లీ స్థానాలలో మెజారిటీ సంపాదించుకుంది. అయితే బీజేపీ మాత్రం ఒకే ఒక్క అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకుంటే, లోక్‌సభ ఎన్నికలలో మాత్రం 21 అసెంబ్లీ స్థానాలలో మెజారిటీ కనబరిచింది. అయితే రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అవినీతి, కాంగ్రెస్ పార్టీ చేతకానితనాన్ని గమనించిన ప్రజలు లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీనీ అందించారు. అయితే ఇద్దరు కొట్టుకుంటే మూడో వాడి ముందు నవ్వులు పాలవ్వడమే తప్పా ఒరిగేదేమి లేదనే నానుడి ఇక్కడ స్పష్టంగా కనిపించింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో పోరులో బీజేపీ బలపడింది.