ఆపరేషన్ ఆకర్ష్ టు స్వీప్

Friday, September 5th, 2014, 12:48:55 PM IST


ఎక్కడ బలం తక్కువగా ఉంటుందో ఆక్కడ బలవంతుడిదే రాజ్యం.. దీనిని అధికార పార్టీలు బాగా ఫాలో అవుతాయి. ఎందుకంటే.. వారికి బలం అవసరం. ఎక్కడ ఏపార్టీ బలహీనంగా ఉందొ చూసి ఆ పార్టీ అభ్యర్ధులను తమవైపు తిప్పుకోవడం రాజకీయ చదరంగంలో ఓ ఎత్తుగడ. అధికార తెరాస పార్టీ ఇప్పుడు అదే పని చేస్తున్నది. ఖమ్మం జిల్లాలో తెరాస కు అసలు బలమైన కేడర్ లేదు.. అంతేకాకుండా అక్కడ తెలుగుదేశం పార్టీ మొదటినుంచి తన ప్రాబల్యాన్ని చాటుకుంది. అయితే, రాష్ట్ర విభజన జరిగాక, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది. తెలంగాణ సెంటిమెంట్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రాలేకపోయింది. 1983 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఖమ్మం జిల్లాలో ముఖ్యనేతగా ఉన్న తుమ్మల ఈరోజు కెసిఆర్ సమక్షంలో తెరాస లో చేరుతున్నారు. దీంతో ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది. మరోవైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇప్పటికే గులాబి కండువా కప్పుకున్నారు. అంతేకాకుండా, ఖమ్మం జిల్లాకే చెందిన ఇల్లందు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోరం కనకయ్య కూడా గులాబిదళంలో చేరడంతో ఖమ్మం జిల్లాలో తెరాస బలపడేందుకు రంగం సిద్దమయింది.

ఖమ్మం జిల్లాలో అమలు చేసిన ఆపరేషన్ ఆకర్ష్ విజయవంతం కావడంతో, ఇప్పుడు కెసిఆర్ తమ బలం తక్కువగా ఉన్న రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో తమ బలం పెంచుకునేందుకు పావులు కదుపుతున్నది. ఇందులో భాగంగానే, ముందుగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ గౌడ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ లు తెరాస లో చేరబోతున్నట్టు తెలుస్తున్నది.