సండ్ర వెంక‌ట వీర‌య్య‌కు త‌ప్పిన ప్ర‌మాదం!

Monday, June 3rd, 2019, 08:42:37 AM IST

సండ్ర వెంక‌ట వీర‌య్య‌.. ఓటుకు నోటు వివాదంలో వినిపించిన పేరిది. ఈ వివాదంతో కేవ‌లం ఖ‌మ్మం జిల్లాకు మాత్ర‌మే తెలిసిన ఈ నేత ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో పాపుల‌ర్ అయ్యారు. టీడీపీ నుంచి ఇటీవ‌లే తెరాస‌లో చేరిన సండ్ర వెంక‌ట వీర‌య్య‌కు తృటిలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. తెలంగాణ అవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా ఖ‌మ్మంలోని పెరేడ్ గ్రౌండ్స్‌లో ప్ర‌భుత్వం ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో సండ్ర వెంక‌ట వీర‌య్య పాల్గొన్నారు. అట్ట‌హాసంగా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం కావ‌డంతో అక్క‌డి నుంచి త‌న సొంత నియోజ‌క వ‌ర్గ‌మైన‌ స‌త్తుప‌ల్లికి బ‌య‌లు దేరారు.

పెరేడ్ గ్రౌండ్ స‌మీపంలోని శివాల‌యం వ‌ద్ద సండ్ర కారు ప్ర‌మాదానికి గురైంది. ఎదురుగా వ‌స్తున్న వాహ‌నాన్ని త‌ప్పించ‌బోయిన సండ్ర కారు డ్రైవ‌ర్ ప‌క్క‌న వున్న కాలువ‌ను గ‌మ‌నించ‌కుండా ప‌క్క‌కు త‌ప్ప‌డంతో కారు వీల్ కాల‌వ‌లో చిక్కుకుపోయింది. దీంతో కారు ఒక ప‌క్క‌కు వాలిపోయింది. ప్ర‌మాదాన్ని గ‌మ‌నించిన డ్రైవ‌ర్ అప్ర‌మ‌త్తం కావ‌డంతో సండ్ర తృటిలో ప్రాదం నుంచి త‌ప్పించుకున్నారు. గ్రామ‌స్తులు అక్క‌డికి చేరుకోవ‌డంతో కాలువ‌లో చిక్కుకున్న కారుని బ‌య‌టికి తీశారు. దీంతో సండ్ర గ‌న్‌మెన్‌లు, డ్రైవ‌ర్ ఊపిరి పీల్చుకున్నారు.