క‌విత ఓట‌మి..తెరాస నేత‌ల సంబ‌రాలు!

Tuesday, June 4th, 2019, 01:15:00 PM IST

ఇటీవ‌ల జ‌రిగిన పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో తెలంగాణ ముఖ్య‌మంత్రి, గులాబీ బాస్ క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు కూతురు క‌ల్వ‌కుంట్ల క‌విత ఓట‌మి పాలైన విష‌యం తెలిసిందే. డి. శ్రీ‌నివాస్ త‌న‌యుడు ధ‌ర్మ‌పురి అర‌వింద్‌ చేతిలో 70 వేల ఓట్ల తేడాతో క‌విత దారుణంగా ఓడిపోయారు. దీని వెన‌క సొంత పార్టీ నేత‌లే కుట్ర ప‌న్నార‌ని తెలుస్తోంది. క‌విత ప్రాతిన‌ధ్యం వ‌హించిన నిజామాబాద్ నియోజ‌క వ‌ర్గ ప‌రిథిలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. తెరాస‌కు ఇంత ప‌ట్టున్న నియోజ‌క వ‌ర్గంలో బీజేపీ జెండా ఎగ‌రేయ‌డం వెనుక సొంత పార్టీ నేత‌ల వెన్నుపోటు రాజ‌కీయాలే బ‌లంగా ప‌నిచేశాయ‌నే వాద‌న విపిస్తోంది. క‌విత ఓట‌మి త‌రువాత పార్టీ నేత‌లు పార్టీ చేసుకున్నార‌నే వార్త గులాబీ బాస్ దాకా వ‌చ్చిందంటే ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు.

క‌విత ఒంటెద్దు పోక‌డ‌ల‌ను త‌ట్టుకోలేని నిజామాబాద్ తెరాస నేత‌లు ప్ర‌త్య‌ర్థి అని తెలిసినా బీజేపీ అభ్య‌ర్థి ధ‌ర్మ‌పురి అర‌వింద్‌కు బాస‌ట‌గా నిలిచారని తెలుస్తోంది. ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్‌పై క‌విత తీవ్ర‌స్థాయి ఆరోప‌ణ‌లు చేయ‌డం, దాన్ని తెరాస అధినాయ‌క‌త్వం స‌మ‌ర్థించ‌డం వంటి కార‌ణాలు క్షేత్ర‌స్థాయి నాయ‌కుల‌కు న‌చ్చ‌లేద‌ట‌. ఒక సీనియ‌ర్ నాయ‌కుడికే ఇలాంటి గౌర‌వం వుంటే మాలాంటి వారి ప‌రిస్థితి మ‌రీ దారుణంగా వుండే అవ‌కాశం వుంద‌ని భావించిన తెరాస నాయ‌కులు మూకుమ్మ‌డిగా కాంగ్రెస్‌, బీజేపీతో క‌లిసి క‌విత‌ను ఓడించార‌ని చెబుతున్నారు. ఇదే పార్టీ అధినేత వ‌ద్ద తెచ్చుకున్న రిపోర్ట్‌లోనూ తేలింద‌ని, దీనిపై గులాబీ బాస్ ఆరా తీస్తున్నార‌ట‌.