పార్లమెంట్ సమావేశాలకు సిద్దమవుతున్న తెరాస..!

Thursday, June 13th, 2019, 05:08:39 PM IST

ఈ నెల 17వ తేది నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలకు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ రెడీ అవుతుంది. నేడు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి టీఆర్ఎస్ తరుపున గెలిచిన లోక్‌సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు హాజరయ్యారు.

అయితే ఈ సమావేశంలో ముఖ్యంగా తెలంగాణకు కేంద్రం నుంచి రావలసిన నిధులు, మరియు గత ఐదేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌ల పనులపై పోరాడాలని నిర్ణయించారు. అంతేకాదు గత ఐదేళ్ళుగా ఎలా ముందుకు వెళ్లాము, ఇప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయాలపై కూడా చర్చలు జరిపారు. అయితే పార్లమెంటరీ పార్టీ, రాజ్యసభలో టీఆర్ఎస్ పక్షనేతగా కేశవరావును కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అయితే గతంలో లోక్‌సభాపక్ష నేతగా జితేందర్‌ రెడ్డి, ఉప నేతగా వినోద్‌ అధ్యక్షత వహించారు. అయితే ఈ సారి వీరిద్దరు లేకపోవడంతో లోక్‌సభ పక్షనేతగా నామా నాగేశ్వరరావును ఎంపిక చేశారు. అంతేకాదు లోక్‌సభ, రాజ్య సభలలో డిప్యూటీ నేత, విప్‌లను కూడా నియమించాలని తీర్మానించింది.