కాంగ్రెస్ పై గురిపెట్టిన తెరాస!

Thursday, June 6th, 2019, 04:48:52 PM IST

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వరుసపెట్టి తమలోకి లాక్కున్న తెరాస శాసనసభలో కాంగ్రెస్ పక్షమే లేకుండా చేయాలని పావులు కదుపుతోంది. కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని తెరాస శాసనసభాపక్షంలో విలీనం చేయాలని చూస్తోంది. ఈ ప్రక్రియ ఇదివరకే మొదలైనా మధ్యలో ఎన్నికల హడావుడి రావడంతో ఆలస్యమైంది. ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో ఆ పనిని రీస్టార్ట్ చేశారు కేసీఆర్.

కాంగ్రెస తరపున గెలిచినవారు 19 మంది కాగా విలీనానికి 13 మంది సభ్యుల మద్దతు తెరాసకు అవసరం. ఇప్పటికే ఆ పార్టీ నుండి సబితారెడ్డి, జాజాల సురేందర్, వనమా వెంకటేశ్వరరావు, చిరుమర్తి లింగయ్య, హర్షవర్థన్ రెడ్డి, సుధీర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, వెంకటరమణా రెడ్డి లాంటి 11మంది తెరాస వైపుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

కాగా ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. తాజాగా ఎంపీగా గెలిచిన ఉత్తమ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ బలం 11కి పడిపోయింది. ఇదే తరుణంగా భావించిన తెరాస గతంలో తమతో సంప్రదింపులు జరిపిన మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోసం ఎదురుచూస్తుంది. ఒకవేళ వారు గనుక చేరిపోతే శాసనసభాపక్షం విలీనం ఇక లాంఛనమే అవుతుంది.