ట్రంప్ సమర్ధుడు, తెలివైనవాడు.. కానీ అతను ఒక అవివేకి అంటున్న అమెరికన్లు

Friday, January 27th, 2017, 07:30:32 PM IST

trumpp3
ఎన్నో నిరసనల మధ్య ట్రంప్ సరిగ్గా వారం రోజుల క్రితం అమెరికా 45వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన పరిపాలన తీరుఫై ప్రఖ్యాత క్విన్నిపియాక్ యూనివర్సిటీ ఒక పోల్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ట్రంప్ అధ్యక్ష హోదాలో చేసిన తొలి (వివాదాస్పద) ప్రసంగం, మొదటి ఐదు రోజులు ట్రంప్ పరిపాలన ఎలా ఉంది…? ట్రంప్ సంతకం చేసిన ఫైళ్ళలోని అంశాలు, వాటిని ఏ మేరకు అమలు చేస్తారు..? మొదలైన ప్రశ్నలు ఉన్నాయి. ఈ సర్వేలో మొత్తం 1,190 మంది ఓటర్లు పాల్గొన్నట్టు క్విన్నిపియాక్ యూనివర్సిటీ తెలిపింది. ఈ సర్వే ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి.

ఈ పోల్ లో అక్కడి ప్రజలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ తెలివైన వాడు, సమర్థుడే కానీ… అతను ఒక అవివేకి అని ప్రజలు చెప్పడం గమనార్హం. 68 శాతం మంది ట్రంప్ సమర్థుడని, 65 శాతం మంది ట్రంప్ తెలివైనవని చెప్పడం విశేషం. అదే సమయంలో 62 శాతం మంది ట్రంప్ ఒక అవివేకి అని తేల్చి చెప్పారు. వందలో 36 శాతం మంది ప్రజలు ట్రంప్ ఐదు రోజుల పాలనకు మద్దతు తెలుపగా, 44 శాతం మంది మాత్రం వ్యతిరేకించారు. ముఖ్యమైన ఫైళ్ల ఫై సంతకాలు చేశారు తప్ప, ఆ విధానాలను కొనసాగించే దిశగా ఆయన అడుగులు వేయట్లేదని ఎక్కువమంది ఓటర్లు అభిప్రాయపడ్డారు. జాతి, లింగ వివక్ష గురించి ఆయనేమి మాట్లాడలేదని కొంతమంది విమర్శించారు.

ఇంకా రిపబ్లికన్లలో 81 శాతం మంది ట్రంప్ పాలనను సమర్దించగా, 3 శాతం మంది వ్యతిరేకించారు. డెమొక్రాట్లలో 4 శాతం మంది ట్రంప్ పాలనకు అనుకూలంగా మాట్లాడగా… 77 శాతం మంది ట్రంప్ పాలన అత్యంత చెత్తగా ఉందని అభివర్ణించారు. అమెరికా మహిళలలో 50 శాతం మంది ట్రంప్ పాలనను తిరస్కరించగా, 33 శాతం మంది అంగీకరించారు. శ్వేతజాతీయుల్లో 43 శాతం మంది ఆయన పాలనను అంగీకరించగా, నల్లజాతీయుల్లో 43 శాతం మంది ఆయన పాలనఫై పెదవి విరిచారు.