రీ ఎంట్రీ కోసం వీరూ ఆరాటం

Wednesday, August 28th, 2013, 06:32:25 PM IST

cricket

భారత డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కు పరుగుల దాహం తీరలేదు. భారత జట్టులో మళ్లీ ఆడాలన్న ఆశ చావలేదు. అందుకే జట్టులో తిరిగి స్థానం సంపాదించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. సౌతాఫ్రికా టూర్ కు వెళ్లే భారత జట్లులో స్థానం సంపాదించడమే టార్గెట్ గా పెట్టుకున్నాడు. ప్రస్తుతం టీమిండియాలో ఓపెనింగ్ బెర్త్ చాలా బిజీగా ఉంది.. ధావన్, రోహిత్ శర్మలు అద్బుతంగా రాణిస్తుండడంతో సెహ్వాగ్ కు ప్లేస్ దక్కడం క్లిష్టంగా మారింది. ఐతే సౌతాఫ్రికా టూర్ కోసం ముగ్గురు ఓపెనర్లను సెలక్ట్ చేసే అవకాశముంది. మూడో ఓపెనర్ స్థానం కోసం సెహ్వాగ్, గంభీర్ లు పోటీపడుతున్నారు. గంభీర్ విదేశాల్లో కౌంటీ మ్యాచులు ఆడేందుకు వెళ్లగా సెహ్వాగ్ మాత్రం ఇక్కడే ప్రాక్టీస్ చేయాలని డిసైడ్ చేసుకున్నాడు.

సౌతాఫ్రికా పేస్ బౌలర్లను సమర్ధంగా పేస్ చేసేందుకు చెన్నై ఎమ్మారెఫ్ పేస్ ఫౌండేషన్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు వీరూ. పేస్ బౌలర్లను ఆడడంలో ఇబ్బంది పడుతున్న వీరూ.. ఎమ్మారెఫ్ డైరెక్టర్ గ్లెన్ మెక్ గ్రాత్ నుంచి టిప్స్ తీసుకుంటున్నాడు. ఇంటర్నేషనల్ మ్యాచుల్లో అనేక సార్లు మెక్ గ్రాత్.. సెహ్వాగ్ ను అవుట్ చేశాడు. ఇతడి బ్యాటింగ్ లోపాలేంటో మెక్ గ్రాత్ కు బాగా తెలుసు…అందుకే వీరూ ఈ ఆసీస్ మాజీ పేసర్ దగ్గర చిట్కాలు పొందుతున్నాడు.. పేస్ ఎటాక్ ను ఎలా ఎదుర్కోవాలి.. ఎటువంటి బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నాడనే అంశాలపై దృష్టి సారించాడు. ఇక ఈ విషయాలన్ని మీడియా కంటపడకుండా వీరూ జాగ్రత్త పడుతున్నాడు.

మొత్తానికి శిఖర్ ధావన్ , రోహిత్ శర్మల కారణంగా వీరూ, గంభీర్ ల ప్లేస్ గల్లంతైంది.. తామేంటో నిరూపించుకుని మళ్లీ జట్టులోకి వచ్చేందుకు ఈ ఇద్దరు ఢిల్లీ డైనమిక్ బ్యాట్స్ మెన్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.