టీఎస్ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ వుంటుందా?

Thursday, June 13th, 2019, 03:30:15 PM IST

తెలంగాణ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ కోసం స‌హ‌నం న‌శించేలా ఎదురుచూశారు తెరాసా నాయ‌కులు. ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం కేవ‌లం ఒకే ఒక మంత్రితో అదీ డిప్యూటీ హోమ్ మినిస్ట‌ర్ మొహ‌మూద్ అలీతో ప్ర‌మాణ స్వీకారం చేయించారు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. ఆ త‌రువాత మ‌ళ్లీ అదే స‌స్పెన్స్‌ను మెయింటైన్ చేశారు. గెలిచిన అభ్య‌ర్థుల్లో అస‌హ‌నం అశాంతి తారా స్థాయికి చేరిన త‌రువాత మొక్కుబ‌డిగా అంద‌రికి షాకిస్తే ఎర్ర‌బెల్లికి మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. ఎంతైనా ఓటుకు నోటు కేసులో అడ్డంగా రేవంత్‌రెడ్డిని బుక్ చేయించింది ఎర్ర‌బెల్లు కాబ‌ట్టి దానికి ప్ర‌తిఫ‌లంగా మంత్రి ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు.

అదే స‌మ‌యంలో త‌న‌కు అత్యంత స‌న్నిహితంగా వుంటే వేముల ప్ర‌శాంత్‌రెడ్డి, ఈట‌ల రాజేంద‌ర్‌, ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి, త‌ల‌సాని శ్రీ‌నివాస‌యాద‌వ్‌, శ్రీ‌నివాస్‌గౌడ్‌, జ‌గ‌దీష్‌రెడ్డి, మ‌ల్లారెడ్డి, నిరంజ‌న్‌రెడ్డి, కొప్పుల ఈశ్వ‌ర్‌ల‌కు మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు. అక్క‌డి నుంచి పార్ల‌మెంట్ ఫ‌లితాల త‌రువాత మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ వుంటుంద‌ని కొంత మందికి ఆశ చూపించారు కానీ ఎంత‌కూ తేల్చ‌డం లేదు. వ‌రంగ‌ల్ నేత దాస్యం విన‌య్ భాస్క‌ర్ మంత్రి ప‌ద‌వి కోసం ఎదురు చూస్తున్నారు కానీ ఆయ‌న ఆశ‌లు అడియాశ‌లు చేస్తున్నారు. ఎప్పుడు విస్త‌ర‌ణ వుంటుంద‌న్న లీకు కూడా ఇవ్వ‌కుండా ఆడుకుంటున్నార‌ని బ‌య‌ట ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రో విష‌యం ఏంటంటే పిల్ల‌కి రొయ్య‌ల మొల‌తాడు క‌డ‌తా అన్న‌ట్టు మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఎప్పుడ‌ని అడిగే ద‌మ్మున్న నేత తెరాస‌లో క‌నిపించ‌డం లేదు. అలాంటి స‌మ‌య‌మే వ‌స్తే కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డిలా పార్టీ మారాల్సిందే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.