అధైర్య పడకండి, విజయం సాధించేది మనమే… అశ్వత్థామరెడ్డి

Wednesday, November 13th, 2019, 11:13:03 PM IST

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దీ రోజులుగా జరుగుతున్నటువంటి ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రస్తుతానికి తీవ్రతరంగా మారనుంది. కాగా ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించేదాకా కూడా సమ్మె ని ఆపేది లేదని బలంగా చెబుతున్నప్పటికీ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఈ విషయంలో ఎందుకిలా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని రాష్ట్రంలోని విపక్ష నేతలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా సమ్మె విషయంలో సీఎం కేసీఆర్ ప్రవరిస్తున్న తీరుపై ఆవేదన చెందుతూ నరేష్ అనే మరొక ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకొని మరణించాడు.

కాగా ఈ విషయంలో తెలంగాణ ఆర్టీసి జెఎసి కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ… ఆర్టీసీ కార్మికుల మరణానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వమే కారణమని, ప్రభుత్వం కావాలనే ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలను ప్రోత్సహిస్తుందని ఆయన ఆరోపించారు. కాగా మహబూబాబాద్‌లో ఆర్టీసి డ్రైవర్ నరేష్‌ మృతదేహానికి నివాళులు అర్పించిన అశ్వత్థామరెడ్డి, ఆతరువాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు నైతిక స్థైర్యం కోల్పోవద్దన్నారు. మన సమస్యలు పరిష్కారం కావాలంటే ఆత్మహత్యలు ఒక్కటే మార్గం కాదని, ఎలాగైనా ఈ విషయంలో విజయం సాధించేది మనమే అని తెలంగాణ ఆర్టీసి జెఎసి కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు.