టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌వి ఆ పీఠాధిప‌తికే?

Tuesday, June 4th, 2019, 11:02:18 AM IST

ఏపీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం చేసిన రోజు నుంచి గ‌త సీఎంల‌కు భిన్నంగా వైఎస్ జ‌గ‌న్ అడుగులు వేస్తున్నారు. వ‌రుస స‌మీక్ష‌ల‌తో శాఖ‌ల‌పై ప‌ట్టుసాధిస్తున్న ఆయ‌న పాల‌క మండ‌లికి సంబంధించి సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఎవ‌రు ఎక్క‌డ వుండాలి?. ఎవ‌రికి ఏ ప‌ద‌వి క‌ట్ట‌బెడితే ఆ స్థానానికి గౌర‌వం వంటి వాటిపై దృష్టిపెడుతున్నారు. ముఖ్యంగా టీటీడీ పాల‌క మండ‌లి బాధ్య‌ల విష‌యంలో ఈ నిర్ణ‌యాల‌ని ప్ర‌క‌టించ‌బోతున్నారు. టీటీడీ అంటే రాజ‌కీయ నాయ‌కుల పున‌రావాస కేంద్రంగా మారింది. ఆగ‌మ శాస్త్రం తెలిసిన వాళ్లు కాకుండా రాజ‌కీయాల‌కు అలవాటు ప‌డిన వాళ్ల‌ని టీటీడీ ఛైర్మ‌న్‌లుగా ఇంత‌కాలం వివిధ ప్ర‌భుత్వాలు నియ‌మిస్తూ వ‌చ్చాయి. అయితే అ ప‌ద్ద‌తికి వైఎస్ జ‌గ‌న్ చ‌ర‌మ‌గీతం పాడ‌బోతున్నారు.

ప్ర‌స్తుతం టీటీడీ ఛైర్మ‌న్‌గా టీడీపీ నేత పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ వున్నారు. టీడీపీ ఓడినా ఇంకా ఆ ప‌ద‌విని ప‌ట్టుకుని వేళాడుతున్నారు. ప్ర‌భుత్వం త‌మ క‌మిటీకి ఉద్వాస‌న ప‌లికే వ‌ర‌కు అదే ప‌ద‌విలో క‌న‌సాగుతాన‌ని తేల్చి చెప్ప‌డంతో అంత వ‌ర‌కు పుట్టా ఏం చేయ‌బోతున్నారు?. ప్ర‌భుత్వ‌మే తొల‌గించే వ‌ర‌కు టీటీడీలో ఎలాంటి స‌మ‌స్య‌కు తెర‌తీయ‌బోతున్నార‌నే చ‌ర్చ‌జ‌రుగుతోంది. ఇదిలా వుంటే టీడీపీ ఛైర్మ‌న్ ప‌ద‌వి కోసం మోహ‌న్‌బాబు పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఆయ‌నతో పాటు ఇదే ప‌ద‌విని చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి ఆశిస్తున్నారు. వైఎస్ హ‌యాంలో టీటీడీ ఛైర్మ‌న్‌గా ప‌నిచేసిన భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి కూడా ఈ ప‌ద‌వి కోసం లైన్‌లో వున్నారు. అయితే వీరంద‌రినీ కాద‌ని తిరుమ‌ల చ‌రిత్ర‌లోనే కొత్త వ్య‌క్తిని జ‌గ‌న్ రంగంలోకి దించుతున్న‌ట్లు తెలుస్తోంది. విశాఖ శార‌దా పీఠాధిప‌తి స్వరూపానందేంద్ర కు టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టాల‌ని, త‌ద్వారా తిరుమ‌ల ప‌విత్ర‌ల‌ను కాపాడిన వాడిగా పేరొస్తుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ట‌. మ‌రి జ‌గ‌న్ ఆలోచ‌న‌ను స్వ‌రూపానందేంద్ర అంగీక‌రిస్తారో లేదో చూడాలి.