అడ్డంగా బుక్క‌యిన టీటీడీ ఛైర్మ‌న్‌!

Thursday, June 13th, 2019, 10:44:47 AM IST

పాత ప్ర‌భుత్వం పోయి కొత్త ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే గ‌త ప్ర‌భుత్వం కేటాయించిన నామినేటెడ్ ప‌ద‌వుల్లో వున్నారు స్వ‌చ్చందంగా వైదొల‌గ‌డం అన్న‌ది ఆన‌వాయితీగా వ‌స్తోంది. దాన్ని స‌వాల్ చేస్తూ ప్ర‌భుత్వం మెడ‌ప‌ట్టి బ‌య‌టికి గెంటేదాకా అదే ప‌ద‌విని ప‌ట్టుకుని వేళాడ‌తాన‌ని టీడీపీ నేత పుట్టా సుధాక‌ర్ యావ‌దవ్ విచిత్ర‌మైన వాద‌న‌ని గ‌త కొన్ని రోజులుగా వినిపిస్తున్నారు. దీనిపై వైసీపీ సీరియ‌స్‌గానే స్పందించాల‌నుకుంది అయితే ఈ లోగానే పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ అధికార దుర్విన‌యోగానికి పాల్ప‌డ్డార‌ని టీటీడీ పాల‌క మండ‌లి ఫిర్యాదు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం పాల‌క‌మండ‌లి చైర్మ‌న్ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ స్విమ్స్‌లో ఉద్యోగ నియామ‌కాల‌పై స్విమ్స్ డైరెక్ట‌ర్ ర‌వికుమార్‌పై ఒత్తిడి చేశార‌ని స్వ‌యంగా టీటీడీ పాల‌క‌మండ‌లి ఫిర్యాదు చేయ‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

స్విమ్స్‌లో గ‌వ‌ర్నింగ్ తీర్మానాల‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేయాలంటూ టీటీడీ చైర్మ‌న్ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ ఒత్తిడి తెచ్చిన‌ట్లు ఆయ‌న‌పై అభియోగాలు మొద‌ల‌య్యాయి. ఈ విష‌యాన్ని స్విమ్స్ డైరెక్ట‌ర్ తితిదేకు ఫిర్యాదు చేయ‌గా దాన్ని ఆధారంగా చేసుకుని పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌పై విచార‌ణ జ‌ర‌పాల‌ని తితిదే అధికారులు దేవాదాయ శాఖ ప్ర‌త్యేక అధికారి మ‌న్‌మోహ‌న్ సింగ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో తితిదే పాల‌క మండ‌లిలో క‌ల‌క‌లం మొద‌లైంది. పార్టీ అధికారం చేజారిన అనంత‌రం నామినేటెడ్ పోస్టుల్లో కొన‌సాగుతున్న వారు వారికి వారుగానే ఆ ప‌ద‌వుల నుంచి వైదొల‌గితే గౌర‌వం..వైదొల‌గ‌క బెట్టు చేస్తే ఏదో రూపంలో దొరుకుతారు అప్పుడు అధికార పార్టీ తాట‌తీసి మెడ‌ప‌ట్టి బ‌య‌టికి గెంటేసేంత‌ప‌ని చేస్తుంది. ఇప్పుడు వైకాపా కూడా పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌ను అలాగే సాగ‌నంప‌బోతోంద‌ని తితిదే పాల‌క‌మండ‌లి స‌భ్యులు చెప్పుకుంటున్నారు.