ర‌విప్ర‌కాష్ త‌న అరెస్టుకు తానే కార‌ణ‌మా?

Friday, June 7th, 2019, 01:37:15 PM IST

ర‌విప్ర‌కాష్‌.. ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం సంచ‌ల‌నంగా మారారు. వ‌రుస బ్రేకింగ్ న్యూష్ల‌తో మీడియా ప్ర‌పంచాన్ని కొత్త పుంత‌లు తొక్కించిన ర‌విప్ర‌కాష్ చివ‌ర‌కు తానే బ్రేకింగ్ న్యూస్‌గా మార‌డం విడ్డూర‌మే కాదు.. విచిత్రం కూడా. ఎవ‌డు తీసుకున్న గోతిలో వాడే ప‌డ‌తాడు.. క‌త్తిప‌ట్టుకున్న వాడు ఆ క‌త్తికే బ‌ల‌వుతాడు… గ‌న్ను ప‌ట్టుకున్నోడు ఆ గ‌న్నుకే బ‌ల‌వుతాడు. ఇది కాలం చెప్పిన నీతి. ఇదే ర‌విప్ర‌కాష్ ఉదంతంతో మ‌రోసారి రుజువైంది. మీడియాకు ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో గౌర‌వాన్ని తీసుకొచ్చింది తానే అని చెప్పుకుంటూ మీడియా గౌర‌వాన్ని అథఃపాతాళానికి తొక్కేసింది కూడా ర‌విప్ర‌కాషే అన్న‌ది నిర్వివాదాంశం.

మీడియాను అడ్డుపెట్టుకుని ఆయ‌న చేయ‌ని దందాలు, బెదిరింపులు లేవు అంటే లెక్క‌కు మిక్కిలి సెల‌బ్రిటీలు ముందుకు వ‌స్తారేమో?. ఎందుకంటే ర‌విప్ర‌కాష్ ఆడుకుంది సెల‌బ్రిటీల‌నే. గ‌త నెల రోజులుగా టీవి9 యాజ‌మాన్యం పెట్టిన కేసుల‌కు సంబంధించి పోలీసుల‌కు చిక్క‌కుండా తిరుగుతున్న ర‌విప్ర‌కాష్ ఎట్ట‌కేల‌కు సుప్రీమ్ కోర్టు మంద‌లించ‌డంతో పోలీసుల ఎదుట హాజ‌రైనా గ‌త మూడు రోజులుగా వారికి స‌హ‌క‌రించ‌కుండా వారి స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తున్నారు. దీంతో ర‌విప్ర‌కాష్‌ని అదుపులోకి తీసుకుని స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టాల‌ని పోలీసులు ఆలోచిస్తున్నారు. ర‌విప్ర‌కాష్ అరెస్టుకు సంబంధించిన లీగ‌ల్ ట్ర‌బుల్స్ రాకుండా గురువారం న్యాయ నిపుణుల‌ను సంప్ర‌దించిన‌ట్లు తెలిసింది. వారి నుంచి స్ప‌ష్ట‌త వ‌స్తే ర‌విప్ర‌కాష్ అరెస్ట్ ఇక లాంఛ‌న‌మే అనే సంకేతాలు వినిపిస్తున్నాయి.