జ‌గ‌న్ కేబినెట్ లో తూ.గో జిల్లా నుంచి ఇద్ద‌రు రాజాలు!!

Saturday, June 1st, 2019, 10:31:13 AM IST

ప్ర‌స్తుతం ఏ నోట విన్నా జ‌గ‌న్ కేబినెట్ మంత్రుల గురించిన ముచ్చ‌ట సాగుతోంది. ఈసారి జాబితాలో ఎవ‌రెవ‌రు ఉంటారు? అంటూ ఎవ‌రికి వారు ఊహాగానాలు సాగిస్తున్నారు. అయితే ఈసారి అత్యంత కీల‌క‌మైన తూర్పు గోదావ‌రి జిల్లా నుంచి ఇద్ద‌రు రాజాల‌కు మంత్రి యోగం ఉంద‌న్న ముచ్చ‌ట వినిపిస్తోంది. తూ.గో జిల్లా నుంచి ఇప్ప‌టికే సుభాష్‌ చంద్రబోస్‌(ఎమ్మెల్సీ కోటా), కన్నబాబు(కాకినాడ రూరల్‌), దాడిశెట్టి రాజా(తుని) పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు జ‌క్కంపూడి రాజాకు తూ.గో నుంచి మంత్రివర్గంలో చోటు ఖాయ‌మైన‌ట్టేన‌న్న మాటా వినిపిస్తోంది.

అందుకు ఎవ‌రి సిఫార‌సు బ‌లంగా ప‌ని చేస్తోంది? అంటే వైకాపా గౌర‌వాధ్య‌క్షురాలు విజ‌య‌మ్మ మాట చెల్లుతోంద‌ని తెలుస్తోంది. మొన్న సీఎం ప‌ద‌వి చేప‌ట్టేప్పుడే త‌న త‌ల్లికి వైయ‌స్ జ‌గ‌న్ స‌ముచిత స్థానం క‌ల్పించారు. గౌర‌వాధ్య‌క్షురాలిగా త‌న‌కు అత్యంత ప్రాధాన్య‌త ఉంది. గ‌తంలోనూ త‌ను సూచించిన వారికి ఎమ్మెల్యే సీట్లిచ్చారు జ‌గ‌న్. ఈసారి కూడా త‌న కేబినెట్ లో విజ‌య‌మ్మ సిఫార‌సు మేర‌కు ప‌లువురికి మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌నున్నాయ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. తూ. గో జిల్లా నుంచి కీ.శే. జ‌క్కంపూడి రామ్మోహ‌న్ కుటుంబానికి విజ‌య‌మ‌మ్మ‌తో ఎంతో బాంధ‌వ్యం ఉంది. వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన‌ప్పుడు త‌మ వెంట న‌డిచిన ప్ర‌ముకుడిగా రామ్మోహ‌న్ కి జ‌క్కంపూడి కుటుంబానికి గొప్ప స్థానం ఉంది. జ‌గ‌న్ వారికి ఎంతో స‌న్నిహితుడ‌య్యింది ఆ క‌మిట్ మెంట్ చూసే. అందుకే ఇప్పుడు జ‌క్కంపూడి రామ్మోహ‌న్ మ‌ర‌ణించినా .. ఆయ‌న వార‌స‌త్వానికి గొప్ప ప్రాధాన్య‌త ల‌భించింద‌ని తెలుస్తోంది. జ‌క్కంపూడి వార‌సుడు రాజాకు.. ఆయ‌న త‌ల్లికి ప్రాధాన్య‌త‌నిస్తున్నారు. రాజానగరం ఎమ్మెల్యే గా మొన్న ఎన్నిక‌ల్లో గెలిచిన‌ జక్కంపూడి రాజాకు విజ‌య‌మ్మ సూచ‌న మేర‌కు ఈసారి జ‌గ‌న్ కేబినెట్ లో మంత్రి ప‌ద‌వి ఖాయ‌మైన‌ట్టేన‌న్న మాట స్ప‌ష్టంగా వినిపిస్తోంది. ఇక తూ.గో జిల్లాలో జ‌క్కంపూడి ఫ్యామిలీ బ‌ల‌మైన కాపు అండ ఉన్న నాయ‌కులుగా ఎదిగారు. అది వైకాపాకు ప్ర‌ధాన బ‌లం అన్న‌ మాట వినిపిస్తోంది. మొత్తానికి న‌మ్మిన వాళ్ల‌ను అంద‌లం ఎక్కించేందుకు జ‌గ‌న్ సిద్ధంగా ఉన్నార‌న్న‌ది ఆస‌క్తిక‌రం. ఇక ఇప్ప‌టికే తూగో జిల్లా తుని నుంచి దాడిశెట్టి రాజా కేబినెట్ మంత్రి బ‌రిలో ఉన్నారు కాబ‌ట్టి.. జ‌క్కంపూడి రాజాకు బెర్తు ద‌క్కితే అదే జిల్లా నుంచి ఇద్ద‌రు రాజాలు జ‌గ‌న్ కేబినెట్ లో ఉన్న‌ట్టే.