కుటుంబంలో, పార్టీలో గొడవలకు కారణమవుతున్న స్టాలిన్ కుమారుడు

Tuesday, July 23rd, 2019, 06:38:48 PM IST

డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధిని రాజకీయ తెర మీదికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలు, శాసనసభ ఉప ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసినందుకు ప్రతిఫలంగా ఆయనకు పార్టీ యువజన విభాగం అధ్యక్షుదిగా నియమించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే వివాదాలు మొదలయ్యాయి.

పార్టీలో తనకెంత ప్రాధాన్యం ఇస్తున్నారో ఉదయనిధికి కూడా అదే స్థాయి ప్రాధాన్యం ఇవ్వాలని అనధికారిక ఉత్తర్వుల్ని పాస్ చేశారట స్టాలిన్. యువజన విభాగ కార్యదర్శిగా పదవి చేపట్టిన ఉదయనిధిని జిల్లాల పర్యటనకు పంపి నిర్వాహకులు, కార్యకర్తలను కలిసేలా చర్యలు చేపట్టడానికి బదులుగా యువజన విభాగం ప్రధాన కార్యాలయమైన అన్బగంకు వచ్చి ఉదయనిధికి శుభాకాంక్షలు తెలపాలంటూ జిల్లాల నిర్వాహకులకు ఉత్తర్వులు ఇచ్చారు.

ఇదే సీనియర్లకు నచ్చలేదు. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా స్టాలిన్ కుమారుడ్ని పెద్దవాడ్ని చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక కరుణానిధి కుమార్తె కనిమోళి సైతం కుమారుడి విషయంలో స్టాలిన్ వ్యవహరిస్తున్న తీరు మరీ విపరీతంగా ఉందని నొచ్చుకుంటున్నారట. పరిస్తితి ఇలాగే కొనసాగితే అంతర్గత కలహాలు తప్పవని పార్టీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు.