పేదవాడి సంక్షేమమే ధ్యేయం

Thursday, September 25th, 2014, 02:04:13 PM IST


విజయనగరం జిల్లా చీపురుపల్లి సామాజిక ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎక్స్ రే ప్లాంట్ ను ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి మృణాళిని అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో కామినేని పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గాడి తప్పిన వ్యవస్థను పట్టాలెక్కించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని స్పష్టం చేశారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ చీపురుపల్లి సామాజిక ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే విజయనగరంలో వైద్య కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామని కామినేని తెలిపారు. ఇక పేదవాడి సంక్షేమమే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయమని కామినేని శ్రీనివాస్ వివరించారు. కాగా సమావేశంలో ఎమ్మెల్యేలు స్వామి నాయుడు, చిరంజీవులు, మాజీ ఎమ్మెల్యేలు బాబురావు, గణపతిరావు తదితరులు పాల్గొన్నారు.